Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ తో ట‌చ్‌లో ఉన్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు?

By:  Tupaki Desk   |   17 Oct 2018 6:51 AM GMT
కాంగ్రెస్‌ తో ట‌చ్‌లో ఉన్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు?
X
తెలంగాణ‌లో కారు జోరు త‌గ్గిందా? ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలుపు క‌ష్ట‌మేనా? వ‌ంద సీట్ల‌కు త‌క్కువ కాకుండా గెల్చుకుంటామంటూ కేసీఆర్‌ - కేటీఆర్ చెబుతున్న మాట‌లు మేక‌పోతు గాంభీర్య‌మేనా? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ అవున‌నే స‌మాధాన‌మిస్తున్నార‌ట ప‌లువురు సీనియ‌ర్ ఐఏఎస్‌లు - ఐపీఎస్‌లు. ఈ ఎన్నిక‌ల్లో కారు టైరుకు పంక్చ‌ర్ కావ‌డం ఖాయ‌మ‌ని.. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావ‌డం అనివార్య‌మ‌ని వారు అంచ‌నా వేస్తున్నార‌ట‌. అందుకే భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ట్యా ఇప్ప‌టికే వారంతా కాంగ్రెస్‌తో ట‌చ్‌లో ఉంటున్నార‌ట‌. దీంతో కేసీఆర్‌, ఆయ‌న పార్టీ నేత‌లు తీవ్రంగా క‌ల‌వ‌ర ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణ‌కు చెందిన 23 మంది సీనియర్ ఐఏఎస్ - ఐపీఎస్ అధికారులు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్కతో ఇటీవ‌ల రహస్యంగా సమావేశమైనట్లు విశ్వసనీయ స‌మాచారం. వారిలో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మీనా, సీనియర్ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్, ఐఏఎస్ శివకుమార్, ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓటమి, మహా కూట‌మి గెలుపు ఖాయ‌మ‌ని వారంతా అభిప్రాయ‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. అందుకే ప‌లువురు అధికారులు నిరంత‌రం కాంగ్రెస్ సీనియ‌ర్ల‌తో ట‌చ్‌లో ఉంటూ వారికి ఎప్ప‌టిక‌ప్పుడు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తున్నార‌ని కొన్నివ‌ర్గాలు చెబుతున్నాయి.

కేసీఆర్ ప్ర‌భుత్వం పై ప్ర‌ధానంగా ఎస్సీ - ఎస్టీ ఉన్న‌తాధికారులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌మ‌ పై ప్ర‌భుత్వం వివ‌క్ష చూపుతోంద‌ని.. త‌మ‌ను అణిచివేస్తోంద‌ని వారు భావిస్తున్నార‌ట‌. న‌చ్చిన‌వారిని కేసీఆర్‌ అంద‌లం ఎక్కిస్తున్నార‌ని.. ఆయ‌న‌కు న‌చ్చ‌నివారిని అప్రాధాన్య పోస్టుల‌కు పంపిస్తున్నార‌ని చాలాకాలంగా ప‌లువురు సిన్సియ‌ర్ అధికారులు మ‌ద‌న‌ప‌డుతున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టురీ డిజైన్‌తో జ‌రుగుతున్న దోపిడీకి సంబంధించిన ఓ స‌మావేశానికి హాజ‌రైనందుకుగాను ఐఏఎస్ ఆఫీస‌ర్ ఆకునూరి ముర‌ళిని కేసీఆర్ ప్ర‌భుత్వం ఏమాత్రం ప్రాధాన్యం లేని పురావ‌స్తు శాఖ‌కు బ‌దిలీ చేయ‌డం గ‌తంలో క‌ల‌క‌లం సృష్టించింది. ప్ర‌భుత్వం త‌మపై వివ‌క్ష చూపుతోందంటూ కొంత‌మంది ఐఏఎస్ - ఐపీఎస్‌లు సమావేశాలు నిర్వహించడం, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జొషీకి వినతి పత్రం సమర్పించడం వంటి పరిణామాలు కూడా గ‌తంలో చోటుచేసుకున్నాయి. అయితే, ఆ వార్త‌లేవీ మీడియాలో రాకుండా కేసీఆర్ కోట‌రీ నియంత్రించిన‌ట్లు తెలుస్తోంది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్న ఉన్న‌తాధికారులు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్ర‌స్తుతం సానుకూల ప‌వ‌నాలు క‌నిపిస్తుండ‌టంతో ఆ పార్టీ నేత‌ల‌తో ఎప్ప‌టికప్పుడు స‌మాచార‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. ఆయా జిల్లాల్లో క్షేత్ర స్థాయి ప‌రిస్థితుల‌ను హ‌స్తం నేత‌ల‌కు వారు వివ‌రిస్తున్నార‌ని.. త‌ద్వారా వారి గెలుపుకు ప‌రోక్షంగా బాట‌లు ప‌రుస్తున్నార‌ని తెలుస్తోంది. తాజా ప‌రిణామాల‌ను టీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుంది? ఉన్న‌తాధికారులను ఆ పార్టీ తిరిగి త‌మ‌వైపుకు తిప్పుకుంటుందా? అనే అంశాలు ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారాయి.