ప్రచార కక్కుర్తి కోసం మీడియానే వాడేశాడు!

Tue Sep 25 2018 14:53:17 GMT+0530 (IST)

ఎవరి అవసరాలు వారివి. ఒకరి అవసరాన్ని ఒకరు భలేగా వాడేసిన విచిత్రమైన వైనమిది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఒక ప్రముఖ పత్రికను ఒక కక్కుర్తి సామాన్యుడు భలేగా బుక్ చేశాడు. తనదైన తెలివితో బోల్తా కొట్టించాడు. ఎక్స్ క్లూజివ్ కక్కుర్తితో సదరు పత్రిక ఇప్పుడు డిఫెన్స్ లో పడటమే కాదు.. ప్రజల ముందు దోషిలా నిలుచోవాల్సిన పరిస్థితి.మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసిన ఈ ఉదంతం ఏమంటే.. ఇటీవల ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ దగ్గర ప్రేమ పెళ్లి చేసుకున్న తన కుమార్తెను.. ఆమె భర్తపైనా కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఇష్టం వచ్చినట్లుగా దాడి చేసిన మనోహరాచారి గుర్తున్నాడా?

ఫుల్ గా తాగేసి.. కుమార్తె భర్త మీద దాడి చేయటమే కాదు.. అడ్డు వచ్చిన తన కుమార్తెపైన శివాలెత్తి.. విచక్షణరహితంగా కత్తితో దాడి చేయటం తెలిసిందే. ఇదంతా చూస్తున్న చాలామంది పట్టించుకోకుంటే..ఈ ఘటన జరుగుతున్న వేళ బైక్ మీద వెళుతున్న ఒక యువకుడు చూసి.. చటుక్కున బండిని ఆపి పరుగున వచ్చి.. మనోహరాచారిని వెనకి నుంచి ఎగిరి తన్నిన వైనం సీసీ కెమేరాల్లో రికార్డ్ అయ్యింది.

ఈ హత్య ఉదంతంలో ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. అయితే.. మనోహరాచారిని నిలువరించేందుకు సాహసిగా మారిన సామాన్యుడు ఎవరు?  వెనుక నుంచి తన్నిన అతగాడి వివరాలు సేకరించేందుకు.. అతను ఎవరో ట్రేస్ చేసేందుకు చాలానే ప్రయత్నించినా.. ఫలితం చిక్కని పరిస్థితి. ఇలాంటివేళ.. ఒక ప్రముఖ పత్రికలో సాహసి సామాన్యుడు ఫలానా అంటూ ఒక వ్యక్తి ఫోటో వేసి.. అతడి గురించి గొప్పలు చెప్పారు.

పోలీసులకు దొరకని సదరు వ్యక్తి మీడియా సంస్థకు దొరకటంతో అతడ్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు క్వశ్చన్లు వేశారు. రెండు.. మూడు ప్రశ్నలతోనే అబ్బాయిగారి బండారం బయట పడి.. అతడు సాహసి కాదని తేల్చారు. ఎందుకిలా చేశావంటూ నిలదీస్తే.. ఏదో ప్రచారం వస్తుందన్న ఉద్దేశంతో చేశానని చెప్పటంతో సదరు మీడియా ప్రతినిధి కంగుతినే పరిస్థితి. ప్రచారం కోసం గొప్పలు చెప్పుకున్న యువకుడిని కౌన్సెలింగ్ ఇచ్చి.. మళ్లీ ఇలా చేస్తే కేసులు పెడతామని హెచ్చరించి పంపేశారు. ప్రచారం కోసం కక్కుర్తి పడి పత్రిక పరువు తీసిన ఆ కుర్రాడి తీరుకు సదరు మీడియా సంస్థ చెప్పుకోలేని ఇబ్బంది పడుతుంటే.. ఇదంతా ఎక్స్ క్లూజివ్ కోసం పడిన పాట్లతోనే అసలు చిక్కంతా అన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి ఒక ప్రముఖ మీడియా సంస్థను వాడేసిన కక్కుర్తి సామాన్యుడి వైనం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారిందని చెప్పక తప్పదు.