మోడీ గురించి కమల్ ఇలా మాట్లాడేశాడేంటి?

Fri Aug 10 2018 19:31:48 GMT+0530 (IST)

తమిళ సూపర్‌స్టార్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ తాజాగా మరో ఆసక్తికరమైన ప్రకటనతో వార్తల్లో నిలిచారు. విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్న కమల్ ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చి తనదైన స్టైల్లో ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. మక్కల్ నీది మయ్యమ్ పేరుతో ఇప్పుడున్న పార్టీలకు విరుద్ధమైన రాజకీయ భావజాలాన్ని ఆయన ప్రకటించారు. అయితే కమల్ మొదటి నుంచీ బీజేపీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అనేక వేదికల్లో అనేక రూపాల్లో ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే తాజాగా మోడీ గురించి మీరేమనుకుంటారని అడిగితే...ఆసక్తికరమైన రిప్లై ఇచ్చారు.కమల్‌హాసన్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే...ఈ మధ్యే మక్కల్ నీధి మయ్యమ్ అనే రాజకీయ పార్టీని ఆయన స్థాపించిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేయనున్నారు. తాజాగా ఆయన సినిమా విశ్వరూపం విడుదల అయిన నేపథ్యంలో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ.. వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని చెప్పారు. ఈ సందర్భంగా మోడీ గురించి ప్రశ్నించగా.. కమల్ తనదైన స్టైల్లో స్పందించారు. ``ముందుగా మోడీ ఒక మనిషి. అందువల్ల మోడీ వ్యతిరేకిగా ఉండటం వల్ల ఉపయోగం లేదు. నేను సిద్ధాంతాలకు వ్యతిరేకం లేదా అనుకూలంగా ఉంటాను. రాహుల్‌గాంధీ అయినా కమల్ అయినా రజనీకాంత్ అయినా. మనం వ్యక్తి పూజ ఎప్పుడూ చేయకూడదు. ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేను మోడీకి వ్యతిరేకం కాదు.. అనుకూలం కాదు.. నేను కేవలం దేశానికి అభివృద్ధికి అనుకూలం`` అని కమల్ హాసన్ స్పష్టంచేశారు.

తనదైన సిద్ధాంతాలతో ముందుకు సాగుతున్నానే తప్పించి తాను ఎవరిపై ద్వేషం పెంచుకోలేదని పెంచుకోబోనని ఆయన వెల్లడించారు. పార్టీలను లేకుండా చేయడంపై కాదు.. పావర్టీ (పేదరికం) లేకుండా చేయడమే తన లక్ష్యమని కమల్ అన్నారు. అందరికీ పేదరికమే శత్రువు కావాలి తప్ప.. ప్రతిపక్ష పార్టీ కాదు అని చెప్పారు. సమస్యలు పరిష్కరించడం మెరుగైన పరిపాలన సామాన్యలు జీవితాలు బాగుపడటం అనే అంశాల ప్రాతిపదికన పరిపాలన సాగాలని కమల్‌హాసన్ ఆకాంక్షించారు. కాగా రాజకీయాల్లోకి రాకముందే తాను కచ్చితంగా కాషాయం వైపు మాత్రం వెళ్లననీ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.