Begin typing your search above and press return to search.

హెల్మెట్ లేదా? రాచకొండ పోలీసులకు దొరికిపోతే సరి

By:  Tupaki Desk   |   15 Sep 2019 5:00 AM GMT
హెల్మెట్ లేదా? రాచకొండ పోలీసులకు దొరికిపోతే సరి
X
అందరూ పోలీసులు ఒకేలా ఉండరన్నట్లుగా.. కొత్త వాహన చట్టం వచ్చిన నాటి నుంచి.. ఆ చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో చలానాల మోత మోగుతోంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం.. చలానాలు వడ్డించే విషయంలో కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తున్నారు. దీంతో.. చలానాల మీద పోలీసుల ఫోకస్ పెరిగిందన్న విమర్శలున్నాయి. ఇలాంటి వాటికిచెక్ పెట్టేందుకు వీలుగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్త తరహా కార్యక్రమానికి తెర తీశారు.

హెల్మెట్ పెట్టుకోని వాహనాదారుల్ని పట్టుకుంటున్న రాచకొండ కమిషనరేట్ పోలీసులు.. వాహనదారులకు ఎడా పెడా ఫైన్లు బాదేయకుండా.. హెల్మెట్లు లేకుండా వాహనాల్ని నడిపే వారి చేత కొత్త హెల్మెట్లను కొనుగోలు చేయిస్తున్నారు. పొల్యూషన్ సర్టిఫికేట్ గడువు పూర్తి అయితే.. దాన్నిఇప్పిస్తున్నారు. అంతేనా.. డ్రైవింగ్ లైసెన్స్ లోని వారికి అప్పటికప్పుడు స్లాట్ బుక్ చేసి.. వారికి లైసెన్స్ లు వచ్చేలా చేస్తున్నారు.

ఇలా వాహనదారులు ఎవరు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారో.. వారి ఇష్యూను క్లోజ్ చేసేలా రాచకొండ పోలీసు కమిషనరేట్ అమలు చేస్తున్న కొత్త విధానం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. దొరికినోళ్లకు దొరికినంతగా చలానాలు బాదేసే తీరుకు భిన్నంగా.. ఇష్యూను క్లోజ్ చేసే తరహాలో తప్పు మూలాల్లోకి వెళుతున్న తీరు ఇప్పుడు పలువురిని ఆకట్టుకుంటోంది. తాజాగా స్టార్ట్ చేసిన ఈ విధానంపై మంత్రి కేటీఆర్ రాచకొండ పోలీసులకు అభినందనల్ని తెలిపారు. అదే సమయంలో నిబంధనల్ని పాటించే వారికి సినిమా టికెట్లు ఇవ్వటం తెలిసిందే. మొత్తంగా ట్రాఫిక్ చలానాల బాదుడి విషయంలో కొత్త తరహాలో పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు.

అయితే.. ఈ కొత్త విధానం రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి.. రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో సరికొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. తాజా విధానం బాగుందంటూ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే విధానాన్ని హైదరాబాద్.. సైబరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసు పరిధుల్లోనూ అమలు చేస్తే బాగుంటుందని చెబుతున్నారు.