Begin typing your search above and press return to search.

మందేయి.. చిందేయి... కానీ చిక్కొద్దు

By:  Tupaki Desk   |   8 Oct 2015 5:30 PM GMT
మందేయి.. చిందేయి... కానీ చిక్కొద్దు
X
చీప్ లిక్కరును ప్రవేశపెట్టబోయి ప్రజల ఛీత్కారంతో బొక్కబోర్లపడిన తెరాస ప్రభుత్వం తాజాగా ఆదాయానికి కొత్త మార్గం కనుక్కుంది. మందుబాబులకు కాస్త వెసలుబాటు కల్పిస్తే నిశ్చింతగా తాగిపడేస్తాని, ఆ విధంగా ఖజానాకు అదనపు వచ్చి చేరుతాయని ప్రభుత్వం లెక్కలేసుకుంది. ఇది గిట్టుబాటు అవుతుందని తేలగానే మందు తాగే సమయాన్ని మరింత పొడిగించడానికి పథకాలు రచించుకుంటోంది.

మందుబాబులూ ఇక మీరు నిశ్చింతగా అర్థరాత్రి వరకూ రోడ్లమీదకొచ్చి తాగేయవచ్చు. మందుషాపులు 11 గంటలవరకు, బార్లు అర్ధరాత్రి వరకు మీకోసం తెరుచుకునే ఉంటాయి. మిమ్మల్ని ఏ పోలీసులూ ఏమీ అనరు. ఏ చట్టమూ మీ గొంతు పట్టుకోదు. జేబులో కాసులుంటే చాలు అలా బయటకు వచ్చి ఇలా మందు కొ్ట్టి చక్కా ఇంటికి పోవచ్చు. మిమ్మల్ని అడిగేవారే లేరు.

అలా అని చెప్పి మీరు పుల్లుగా మందు కొట్టి రాత్రిపూట బండి నడుపుతామంటే మాత్రం కుదరదు. మీ తాట తీయడానికి, మీచేత ఫైన్ కట్టించుకోవడానికి డ్రంకెన్ డ్రైవ్ ట్రాపిక్ బాబులు పొంచుకుని ఉంటారు. తాగి తందనాలాడటం వరకే మీకు హక్కు ఉంటుంది కాని డ్రైవింగ్ జోలికి వెళ్లారో మత్తు దిగిపోతుంది జాగ్రత్త. మందుతో ప్రజల జేబులకు చిల్లు. డ్రంకెన్ డ్రైవ్ పోటుతోనూ ప్రజల జేబులకు చిల్లు. మందు ఆదాయమూ మాదే. ట్రాఫిక్ రాస్తాలలో ఫైన్ల రూపంలో ఆదాయమూ మాదే.. ఇదేం న్యాయం, ఇదేం లాజిక్కు అని మమ్మల్ని అడక్కండి. ఎందుకంటే. అదంతే మరి.