విమానం హైజాక్ యత్నం..హైదరాబాదీ అరెస్ట్

Thu Apr 20 2017 19:48:43 GMT+0530 (IST)

విమానాన్ని హైజాక్ చేస్తామని బెదిరింపులకు పాల్పడిన ఓ యువకుడికి పోలీసులు అరదండాలు వేశారు. విమానం హైజాక్ చేస్తానని హెచ్చరిస్తూ దరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ముంబయి పోలీసులకు బెదిరింపు మెయిల్ ను పంపించాడు. ఈ మెయిల్ ఆధారంగా వివరాలు తీసిన ముంబై పోలీసులు అది హైదరాబాద్ నుంచి వచ్చినట్లు గుర్తించి ఇక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన నగర పోలీసులు దర్యాప్తు చేపట్టి మెయిల్ చేసిన యువకుడు హైదరాబాద్ అమీర్ పేటలో ఉన్నట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ సిబ్బంది యువకుడు వంశీని అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలాఉండగా... జెట్ ఎయిర్‌వేస్ విమానం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో విమానం ముందు భాగానికి చెందిన వీల్ విరిగిపోయింది. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 60 మంది ప్రయాణికులు అయిదుగురు సిబ్బంది ఉన్నారు. డెహ్రాడూన్ నుంచి ఆ విమానం ఢిల్లీ చేరుకుంది. బుధవారం సాయంత్రం 4.45 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. ల్యాండింగ్ టైమ్ లో నోజ్ వీల్ విరిగిన తర్వాత విమానం రన్ వేపై ఓ పక్కకు ఒరిగింది. దీంతో పెద్దగా ప్రమాదం చోటుచేసుకోలేదు. ఈ ఘటన తర్వాత రన్ వేను సుమారు రెండు గంటల పాటు మూసివేశారు. ఇందిరా గాంధీ విమానాశ్రయంలోని 29వ రన్ వేపై ఈ ఘటన జరిగింది. ముందు భాగం వీల్ విరిగిపోవడం వల్ల విమాన స్టీరింగ్ సమస్యగా మారిందని జెట్ ఎయిర్ వేస్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/