Begin typing your search above and press return to search.

హైద‌రాబాదీలంద‌రి కోరిక ఇదొక్క‌టే

By:  Tupaki Desk   |   11 Oct 2017 4:17 PM GMT
హైద‌రాబాదీలంద‌రి కోరిక ఇదొక్క‌టే
X
దాదాపు 90 లక్షల మంది నివసిస్తున్న తెలుగు వారి ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌ ను వ‌రుణుడు వ‌ద‌ల‌డం లేదు. మ‌రో 48 గంట‌ల పాటు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. మ‌ర‌ఠ్వాడా నుంచి తెలంగాణ మీదుగా రాయ‌ల‌సీమ వ‌ర‌కు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోందని - దీని ప్ర‌భావంతో ఇవాళ - రేపు కోస్తాంధ్ర - రాయ‌ల‌సీమ‌ - తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది. హైద‌రాబాద్‌ కు కాస్త ఎక్కువ‌గా ముప్పే ఉంద‌ని చెప్పింది. ఇప్ప‌టికే కురిసిన వాన విలయతాండవం విశ్వనగరంలో ప్రళయం సృష్టిస్తోంది. ప్ర‌యాణికుల‌కు - న‌గ‌ర‌వాసుల‌కు న‌రకం క‌నిపిస్తోంది. కాలనీలన్నీ నీళ్ళతో నిండి ఉన్నాయి. పేదల కళ్ల‌లో కన్నీరు కారుతోంది.

హైద‌రాబాద్ నగరం నలువైపుల నీటి దిగ్బంధనం కొనసాగుతోంది. రహదారులన్నీ గోదారులై నావలు నడుస్తున్నాయి. ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకోలేక ప్రజలు విలపిస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలకు పాలకులు పూనుకోవటం లేదు. అధికారులకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. అప్పుడప్పుడు అధికారులతో చుట్టపు చూపుగా వెళ్ళి ఉచిత సలహాలిస్తున్నారు. పనులకు పర్మిషన్లు ఇచ్చి ప్రజల భావోద్వేగాలను బ్యాలన్స్‌ చేస్తున్నారు. భాగ్యనగరం బాధలు ప్రభుత్వానికి పట్టటం లేదు. వ‌రుస‌గా కురుస్తున్న వరుస వర్షాలకు వారం క్రితం ఇద్దరు చనిపోయారు. కరెంట్‌ షాక్‌ తో మరొకరు చనిపోయారు. సోమవారం నాటి వర్షానికి ఇద్దరు చనిపోయారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పస్తులతో పనులు లేక ఇంటి నుండి బయటకు రావటం కష్టంగా ఉంది.

వాననీళ్లు రోడ్లమీదకు రావడంతో ప్రజలు ప్రయాస పడుతున్నారు. నాలుగు గంటల నుండి ఐదు గంటలు అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. అర్థరాత్రి దాటినా వాహనదారులు ఇళ్ల‌కు చేరుకోలేకపోతున్నారు. వర్షానికి రోడ్ల మీద నీళ్ళు నిలవటంతో వాహనాల రాకపోకలకు గుంతలు పడ్డాయి. పైపులైన్‌ లీకేజీలతో రోడ్లు కొట్టుకు పోయాయి. మంచినీటి పైపులు పగిలిపోయాయి. వర్షపునీరు మంచినీటితో కలిసి నీటి కాలుష్యం ఏర్పడుతోంది. ఫలితంగా జబ్బులు చుట్టుముట్టే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే నీటి నిలువతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. నీటిని నిలువలేకుండా చూసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. కానీ వారాల కొద్దీ వాననీరు బయటకు పోకపోవటంతో నీటితోనే ముంపు ప్రాంత ప్రజలు సహజీవనం సాగిస్తున్నారు. అంటురోగాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే నగరమంతా విషజ్వరాలతో విలవిల్లాడుతోంది. వాతావరణంలో నెలకొన్న మార్పుల వలన డెంగీ జ్వరాల బెంగ పెరుగుతోంది. స్వైన్‌ ఫ్లూ విజృంభించే ప్రమాదం ఉంది. తాగునీటి కాలుష్యంతో డయేరియా - టైఫాయిడ్‌ వచ్చే అవకాశం ఉంది. పాలకులు ప్రజలకు వర్షాల వలన తీసుకోవల్సిన జాగ్రత్తలను తెలియజేయాలి. అంటువ్యాధులను అరికట్టే చర్యలు తీసుకోవాలి. రోగాల బారిన పడకుండా ప్రజలను రక్షించాలి. విశ్వనగరం అభివృద్ధే మా లక్ష్యమని ప్రకటించిన పాలకులు ప్రకృతి విపత్తులను తట్టుకుని, విలసిల్లేలా చేయాలి. జన జీవనం స్తంభించకుండా చూడాల్సిన బాధ్యత మరువద్దని హైద‌రాబాదీలు కోరుతున్నారు. ఇదొక్క‌టే త‌మ కోరిక అంటూ విన్న‌వించుకుంటున్నారు.