Begin typing your search above and press return to search.

బిస్కెట్ పాకెట్ కోసం అంత ఆరాటమా?

By:  Tupaki Desk   |   26 Sep 2016 11:03 AM GMT
బిస్కెట్ పాకెట్ కోసం అంత ఆరాటమా?
X
నిజమే.. బిస్కెట్ పాకెట్ కోసం అంత ఆరాటాన్ని వారు ఎప్పుడూ ఊహించి ఉండరు. ఎందుకంటే.. అలాంటి బిస్కెట్ పాకెట్లు అవసరమైతే వంద కొని.. పంచి పెట్టే స్తోమత ఉన్న వాళ్లే. కానీ.. రోజులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. బ్యాంకు అకౌంట్లో బ్యాలెన్స్ ఫుష్కలంగా ఉన్నా.. దాహం తీరేంత నీళ్లు.. ఆకలి తీరేంత భోజనం లేకుంటే ఎంత డబ్బులంటే మాత్రం ఏం లాభం? అన్ని ఉన్నా.. కడుపు నిండా తినలేని దురదృష్టకర పరిస్థితి భాగ్యనగరిలోని చాలామందికి ఎదురైంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలే దీనికి నిదర్శనం. ఇందుకు ఈ ఫోటోనే సాక్ష్యం.

వరుసగా కురిసిన అతి భారీ వర్షాలతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయం కావటం తెలిసిందే. పెద్ద పెద్ద బిల్డింగుల్లో నివాసం ఉంటున్న వారంతా బిక్కుబిక్కుమనే పరిస్థితి. తలెత్తి చూస్తేకానీ బిల్డింగ్ మొత్తం కనిపించని భవనాల్లో ఉన్న వారికి.. ఇప్పుడదే శాపమైంది. నల్లాల పక్కనే.. చెరువుల్ని ఆక్రమించి కట్టించి ఇచ్చిన బిల్డర్లు దుర్మార్గానికి.. దురాశకు ఏమీ తెలీని అమాయకులు అడ్డంగా బుక్ అయ్యారు.

రికార్డుస్థాయిలో కురిసిన వానలతో వందలాది అపార్ట్ మెంట్లు జలమయం కావటమే కాదు.. బయటకు రాలేని పరిస్థితి. ఒకరోజో.. రెండు రోజులో అయితే ఓకే.. ఐదారు రోజులు గడుస్తున్నా.. కింద నీటి ప్రవాహం తగ్గకపోవటంతో.. ఎత్తున ఉన్నమేడలోనే ఉండాల్సిన దుస్థితి. దీంతో నిత్యవసరాల నుంచి ఆహారం కోసం తీవ్ర ఇబ్బందికి గురయ్యే పరిస్థితి.

గడిచిన ఆరు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న ఆల్విన్ కాలనీ ధరణి నగర్ అపార్ట్ మెంటు వాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. కిందకు రావాలంటే.. రానివ్వకుండా నిలిపేస్తున్న నీటితో వారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. రోజులు గడిచినా పరిస్థితుల్లో మార్పు రాకపోవటంతో ఇంట్లో ఆహారం నిండుకున్న పరిస్థితి. దీంతో.. బాధితులకు బిస్కెట్ ప్యాకెట్లను పంచారు. ఇళ్లల్లోకి వచ్చి ఇచ్చే అవకాశం లేకపోవటంతో.. మేడ మీద ఉండే వారికి అందేలా బిస్కెట్ ప్యాకెట్లను పైకి విసిరారు. వాటిని అందుకునే క్రమంలో ఒక మహిళ విఫలం కావటం.. చేజారిన బిస్కెట్ ప్యాకెట్ కోసం సదరు మహిళ పడిన వేదన చూస్తే గుండె కలుక్కుమనక మానదు. భాగ్యనగరంలోని వాన బాధితుల దుస్థితి ఏమిటన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పే ఈ ఫోటో ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రచురించింది.