Begin typing your search above and press return to search.

చిన్నారి బ‌లి కేసులో ఆడియో టేపుల క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   22 Feb 2018 7:02 AM GMT
చిన్నారి బ‌లి కేసులో ఆడియో టేపుల క‌ల‌క‌లం
X
హైద‌రాబాద్ ఉప్ప‌ల్ చిలుకాన‌గ‌ర్ లోని చిన్నారి బ‌లి ఉదంతం కేసుకు సంబంధించిన కొన్ని ఆడియో టేపులు వెలుగులోకి వ‌స్తున్నాయి. దీన్ని ఆధారంగా అస‌లు దోషులు ఎవ‌రు..? ఆ చిన్నారిని బ‌లి ఎందుకు ఇచ్చారు..? ఇంకెంత‌మంది దోషులు ఉన్నారో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌న సృష్టించిన చిన్నారి బ‌లి కేసును చేధించే ప‌నిలో ప‌డ్డారు పోలీసులు. చిలుకా న‌గ‌ర్ కు చెందిన క్యాబ్ డ్రైవ‌ర్ రాజ‌శేఖ‌ర్ (40) - శ్రీల‌తలు భార్య భ‌ర్త‌లు . గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా రాజశేఖ‌ర్ భార్య శ్రీల‌త అనారోగ్యంతో సత‌మ‌త‌మ‌వుతుంది. దీనికి తోడు ఆర్ధిక స‌మస్య‌లు. గుళ్లు - గోపురాలు - ఆస్ప‌త్రుల చుట్టూ తిరిగినా ఆమె ఆరోగ్యం మాత్రం కుద‌ట ప‌డ‌లేదు.

అయితే రెండేళ్ల క్రితం వ‌రంగ‌ల్ లో జ‌రిగే స‌మ్మ‌క్క జాత‌ర‌కు వెళ్లిన ఆ ఇద్ద‌రు దంప‌తులు కోయదొర‌తో త‌మ‌కు త‌లెత్తుతున్న ఇబ్బందుల గురించి చెప్పుకున్నారు. వారి బాధ‌ల్ని విన్న ఆ కోయదొర త్వ‌రలో చంద్ర‌గ‌హ‌ణం రాబోతుంద‌ని, ఆ రోజు న‌ర‌బ‌లి ఇస్తే మీ క‌ష్టాల‌న్నీ తీరిపోతాయ‌ని ఓ స‌ల‌హా ఇచ్చాడు. అస‌లే బాధ‌ల్లో ఉన్న రాజేశేఖ‌ర్ గొర్రె క‌సాయి వాడిని న‌మ్మిన‌ట్లు కోయ‌దొర చెప్పిన మాటల్ని గుడ్డిగా న‌మ్మాడు. దొర చెప్పిన మాట‌ల్ని మ‌న‌నం చేసుకున్న రాజశేఖ‌ర్ అప్ప‌టి నుంచి న‌ర‌బ‌లి ఎప్పుడు ఇవ్వాలా అని ఆశ‌గా ఎదురు చూశాడు. చంద్ర‌గ్ర‌హ‌ణం రానే వ‌చ్చింది. జ‌న‌వ‌రి 31న రాత్రి బోయ‌గూడ ఫుట్ పాత్ పై త‌ల్లి ఒడిలో నిద్రిస్తున్న చిన్నారిని రాజ‌శేఖ‌ర్ కిడ్నాప్ చేశాడు.

అనుకున్న టైం ప్ర‌కారం రాజశేఖ‌ర్ త‌నకు తెలిసిన స్నేహితుల స‌హకారంతో క్షుద్ర‌పూజ‌లు నిర్వ‌హించారు. చంద్ర్ర గ్రహణం రోజున ఇంట్లో భార్యతో న‌గ్నంగా పూజలు చేసి ఆ తరువాత చిన్నారిని బలిచ్చారు.

చంద్రుని నీడ శిశువు తలపై పడేలా ఉంచాలని దొర‌ చెప్పడంతో చిన్నారి తలను మేడపై ఉంచాడు. ఆ తరువాత రసాయనాలతో ఇల్లంతా శుభ్రం చేశారు.. మొండాన్ని మూసీ న‌దిలో ప‌డేశారు. అయితే క్షుద్ర పూజ జ‌రిగిన మ‌రుస‌టి రోజు రాజశేఖర్ అత్త బాల‌ల‌క్ష్మి బిల్డింగ్ పై బ‌ట్ట‌లు ఆరేసేందుకు వ‌చ్చింది. అంతే అక్క‌డ తెగిన త‌ల‌ను చూసిన‌ బాలలక్ష్మి భ‌యంతో కేకలు వేసింది. స్థానికుల స‌మాచారంతో అక్క‌డికి చేరుకున్న పోలీసులు చుట్టూ ప‌రిస‌రాల్ని డాగ్‌ స్వ్కాడ్ - క్లూస్‌టీం తో విచారణ ప్రారంభించారు.

విచార‌ణ‌లో భాగంగా అత్యాధునిక టెక్నాల‌జీని ఉప‌యోగించిన పోలీసులు రాశేఖ‌ర్ ఇంట్లో ర‌క్తం మ‌ర‌క‌ల్ని గుర్తించారు. సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ కు పంపించారు. అనుమానం వ‌చ్చిన రాజశేఖ‌ర్ దంపుతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు పోలీసులు 122 సెల్‌ ఫోన్లు - 54 సెల్‌ టవర్ల డేటాను అనలైజ్ చేసి మొత్తం 40 మంది సాక్షులను - 45 మంది అనుమానితులను - వంద సిసి కెమెరాల డేటాను పరిశీలించారు. ఇక పూర్తిస్థాయిలో విచారించగా నేరం తామే చేసినట్టు రాజశేఖర్ దంపతులు ఒప్పుకున్నారు.

తొల‌త ఈ కేసుకు సంబంధించి రాజశేఖ‌ర్ ను విచారించాగా తాను అమాయ‌కుణ్ని అని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ పోలీసులు వ‌దులుతారా. త‌న‌దైన స్టైల్లో విచారించ‌గా న‌ర‌బ‌లి గురించి మొత్తం క‌క్కాడు.

ఈ క్షుద్ర పూజల్లో మంత్రగాడి ఆదేశం మేరకు రాజశేఖర్ దంపతులు నగ్నంగా పాల్గొన్నట్లు నిజం ఒప్పుకున్నాడు. ఇవన్నీ కేవలం మంత్రగాడి సలహాతోనే దంపతులిద్దరూ చేసినట్లు విచారణలో చెప్పాడు. ఆర్ధిక‌ - అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్లే ఇంత‌టి దారుణానికి ఒడిగ‌ట్టిన‌ట్లు ఒప్పుకున్నాడు. ఈ నరబలిలో ముగ్గురు మహిళలు పాల్గొన్నార‌ని.. బలి తర్వాత చిన్నారి మొండాన్ని నగరంలోని మూసీనదిలో పడేసినట్లు చెప్పాడు. దీంతో మూసీనదికి చేరుకున్న పోలీసులు పసికందు బట్టలను స్వాధీనం చేసుకున్నట్లు మీడియాకు వివరించారు. ఈ నరబలి కేసులో మొత్తం 8మందిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. రాజశేఖర్ - అతని భార్య శ్రీలత - తల్లి - ఆటో డ్రైవర్ రాజశేఖర్‌ తోపాటు మరో ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా ఈ న‌ర‌బ‌లిపై రాజశేఖ‌ర్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే రాజ‌శేఖ‌ర్ ఫోన్ లో కొన్ని ఆడియో టేపుల్ని గుర్తించిన పోలీసులు వాటిని ల్యాబ్ కు పంపించారు. నిందితుడు గ‌త న‌వంబ‌ర్ 17వ తేదీన త‌న ఇంట్లో జ‌రిగిన 34నిమిషాల ఆడియో టేపు స్వాధీనం చేసుకున్న స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ పి. వెంకటేశ్వ‌ర్లు - ఉన్న‌తాధికారులు ఆ ఆడియో టేపును ప‌రిశీలించారు. ఆ ఆడియో టేపుల్లో రాజ‌శేఖ‌ర్ భార్య శ్రీల‌తను ప‌రాయి స్త్రీ ఆవ‌హించింద‌నే అనుమానం వ్య‌క్తం చేసిన నిందితుడు అత‌ని భార్య‌తో ఫోన్ లో మాట్లాడాడు.

తమకు ఆర్థిక - ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయని - తన భార్యను ఎందుకు వేధిస్తున్నావని రాజశేఖర్ పరాయి స్త్రీని అడిగాడు. నీకు ఏ విధమైన బలి కావాలి - జంతు బలి కావాలా - నరబలి కావాలా అని రాజశేఖర్ అడిగినట్లు తేట‌తెల్ల‌మైంది. ఈ ఆడియో టేపుద్వారా కేసును - కేసులో ఉన్న మ‌రికొంత‌మంది నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధ‌మ‌య్యారు.