Begin typing your search above and press return to search.

ఆటోవాలా బంద్ లో న్యాయం ఉందా?

By:  Tupaki Desk   |   1 Sep 2015 4:59 AM GMT
ఆటోవాలా బంద్ లో న్యాయం ఉందా?
X
హైదరాబాద్ మహానగరంలో ఇంచుమించు కోటి మంది వరకు ప్రజలు బతుకుతున్నారు. వీరంతా ఒకసారి కాకపోతే.. మరోసారి అయినా అనుభవమైన ఘటన ఒకటి ఉంటుంది. తమ హక్కుల సాధన కోసం గళం విప్పుతూ.. రోడ్డు మీదకు ఎక్కే ఆటోవాలాల చేతిలో చేదు అనుభవం గ్యారెంటీ. నిబంధనల గురించి తెగ చెప్పేసే వీరు.. నిబంధనల్ని ఏ మాత్రం పట్టించుకోరు. స్వల్ప దూరానికి మీటర్ అస్సలు వేయరు. రూ.20 ఛార్జీకి రూ.50 అడుగుతారు. అదేమంటే.. ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటారు.

అందరూ ఆటోవాలాలు ఇలానే చేస్తారని చెప్పటం లేదు కానీ.. ఎక్కువమంది ఆటోవాలాల తీరు ఇలానే ఉంటుంది. రూల్స్ గురించి మాట్లాడే ఆటోవాలాలు.. అవే రూల్స్ ను పాటిస్తారా? అంటే.. నిజం ప్రతిఒక్క హైదరాబాదీకి అనుభవమే.నిజానికి ఆటోవాలాలు వైఖరి.. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా ఇంచుమించు అదే తీరులో ఉంటుంది.

తమ అవసరాలకు మాత్రమే రూల్స్ అన్నట్లు మాట్లాడే ఆటోవాలాలు..తాజాగా మరోసారి బంద్ పాటిస్తున్నారు. దీనికి వారు చెబుతున్నదేమిటంటే.. ఢిల్లీలో మాదిరి హైదరాబాద్ లో నడుస్తున్న ఉబెర్.. ఓలా లాంటి క్యాబ్ సర్వీసుల్ని వెంటనే నిషేధించాలి. నిజమే.. ఉబెర్ లాంటి కంపెనీలు.. ఏసీ కారులో కిలోమీటర్ కు రూ.7 వసూలు చేస్తుంటే.. ఆటోవాలాలు మాత్రం అందుకు భిన్నంగా రూ.9 నుంచి రూ.10 వసూలు చేస్తారు.

ఉబెర్ క్యాబ్ ను ఆరేడు కిలోమీటర్ల దూరానికి వస్తావా? అంటే మారు మాట్లాడకుండా ఓకే చెప్పేస్తారు. కానీ.. అదే ఆటోవాలాను కిలో మీటర్ దూరానికి వస్తావా అంటే మాత్రం నో అనేస్తాడు. ఆన్ లైన్ లో బుక్ చేసుకునే క్యాబ్ డ్రైవర్ కు నేను అక్కడికి రాను.. ఇక్కడికి రాను అనే మాట ఉండదు. కానీ.. ఆటోవాలా మాత్రం అందుకు భిన్నంగా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు.

మాట్లాడుకునేది ఒక రేటుకైనా.. చివరకు వచ్చేసరికి మాత్రం ఓ.. ఇరవై ఎక్కువ ఇవ్వండని అడుగుతారు. ఒకవేళ నో చెబితే.. మొహం మాడ్చేయటం మామూలే. అలాంటి ఆటోవాలా.. బుధవారం హైదరాబాద్ లో ఆటో బంద్ చేపట్టనున్నారు. హైదరాబాద్ లోని వేలాది ఆటోలు బుధవారం రోడ్డు ఎక్కవని చెబుతున్నారు. నిత్యం తమ హక్కుల గురించి గళం విప్పే ఆటోవాలాలు.. తమ బాధ్యతల గురించి ఎందుకు గుర్తించరో..?