Begin typing your search above and press return to search.

నెల్లూరు రాజకీయాల్లో అనూహ్య మార్పులు

By:  Tupaki Desk   |   26 Nov 2015 5:30 PM GMT
నెల్లూరు రాజకీయాల్లో అనూహ్య మార్పులు
X
మంత్రి నారాయణ ఒకప్పుడు విద్యా సంస్థల అధినేత. టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్నా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లూ ఆ పార్టీ నేతల దయాదాక్షిణ్యాల కోసం చూడాల్సిందే. నెల్లూరులోనూ ఆనం సోదరులు - నేదురుమల్లి జనార్దన రెడ్డి - ఆదాల ప్రభాకర్ రెడ్డి తదితరులతో సఖ్యతగా ఉండాల్సిన పరిస్థితి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా నెల్లూరులో సోమిరెడ్డి చంద్ర మోహన రెడ్డి చక్రం తిప్పాడు. దాంతో నారాయణ కూడా సోమిరెడ్డి దగ్గర విధేయుడుగానే ఉండేవాడు.

ఇప్పుడు నెల్లూరులో పరిస్థితులు మారాయి. రాజకీయ నాయకుడు కాకపోయినా మంత్రి పదవిని చేపట్టిన తర్వాత నారాయణ రాజకీయ దురంధరుడు అయిపోయాడు. చంద్రబాబుకు సన్నిహితుడు కావడం, ఆత్మీయుల్లో ఒకడు కావడంతో ఆయనకు ఇక తిరుగు ఉండడం లేదు. ఇప్పుడు సోమి రెడ్డి చంద్ర మోహన రెడ్డి ఎత్తులకే నెల్లూరులో నారాయణ చెక్ పెడుతున్నాడు. సోమిరెడ్డిని కాదని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే సోమిరెడ్డి కూడా కొన్ని విషయాల్లో నారాయణను సంప్రదించాల్సి వస్తోంది. సోమిరెడ్డి పరిస్థితే ఇలా ఉందంటే ఇక మిగిలిన నాయకుల పరిస్థితి గురించి చెప్పాల్సిన పరిస్థితి లేదు.

ఇప్పుడు ఈ కోవలోకి ఆనం బ్రదర్స్ కూడా చేరనున్నారు. ఎవరైనా ఆనం బ్రదర్స్ ఇంటికి రావాల్సిందే కానీ ఆనం బ్రదర్స్ ఎక్కడికీ వెళ్లిన దాఖలాలులేవు. కానీ, ఇప్పుడు నెల్లూరు జిల్లాకు ఒకే ఒక్కడు మంత్రి నారాయణ. జిల్లాలో ఏది కావాలన్నా ఆయన దగ్గరకు వెళ్లి అడగాల్సిందే. నారాయణ అనుమతిస్తేనే ఆనం బ్రదర్స్ కు కూడా పనులు అవుతాయి. లేకపోతే లేదు. ఒకప్పుడు విధేయుడుగా ఉన్న వ్యక్తి ముందు విధేయులుగా ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు నెల్లూరు రెడ్డి నాయకులకు వచ్చింది. నెల్లూరు అంటే రెడ్ల ప్రాబల్యం ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ కాపు వర్గానికి చెందిన నారాయణ ఆధిపత్యం చలాయిస్తుంటే అన్ని పార్టీల్లోని రెడ్డి నాయకులు విధేయులుగా ఉండాల్సిన పరిస్థితి. నారాయణ రాజకీయ ఎత్తులకు నెల్లూరు రెడ్డి నాయకులు కూడా చిత్తవుతున్న విచిత్ర పరిస్థితి.