Begin typing your search above and press return to search.

తమ్ముళ్ల మొద్దు నిద్రతో ఏపీ కాంగ్రెస్ కు పునర్జన్మ

By:  Tupaki Desk   |   24 May 2016 8:05 AM GMT
తమ్ముళ్ల మొద్దు నిద్రతో ఏపీ కాంగ్రెస్ కు పునర్జన్మ
X
రాజకీయాలు ఎంత చిత్రమైనవి? ఛీ కొట్టించుకున్న చోటే జయజయధ్వానాలు చేయించుకోవటం రాజకీయాల్లోనే సాధ్యమవుతుంది. ఎంతటి దారుణమైన పరాభవమైనా.. దాని ప్రభావం చాలా కొద్దిరోజులే ఉంటుంది. ఏపీని అడ్డదిడ్డంగా ముక్కలు చేసేసి కాంగ్రెస్ పార్టీ అందుకు తగిన మూల్యం చెల్లించుకున్న సంగతి తెలిసిందే. తమను దారుణంగా వంచించి మోసం చేసిన దానికి ప్రతిగా ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ స్థానంలోనూ కాంగ్రెస్ నెగ్గకుండా ఏపీ ప్రజలు తగిన శాస్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి పాతి పెట్టారని.. మళ్లీ ఆ పార్టీ కోలుకునేందుకు కనీసం పాతికేళ్లు అయినా పడుతుందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి.

అయితే.. అవన్నీ ఊహాగానాలేనన్న విషయం తాజాగా తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ పాతాళంలో పాతి పెట్టినట్లుగా చెబుతున్న మాటల్లో నిజం లేదని.. అధికారపక్షం వైఫల్యంలోనే ఉందన్నది అర్థమైంది. తాజాగా గోదావరి.. కృష్ణా నదులపై తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఏపీ ఏడారి అవుతుందన్న అంశంపై నిరసన వ్యక్తం చేస్తూ బెజవాడలో చేపట్టిన ధర్నా కార్యక్రమం భారీ విజయవంతం కావటమే కాదు.. ఏపీలో కాంగ్రెస్ కు ఉనికే లేదన్నట్లుగా మాటలు చెబుతున్నట్లుగా వారంతా విస్తుపోయేలా చేసింది. ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ లేకున్నా.. ఆ పార్టీ నేతలు ఇచ్చిన పిలుపునకు అంత భారీ స్పందన ఎందుకు వచ్చిందన్న విషయంపై ఏపీ అధికారపక్షం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్లేనని చెప్పక తప్పదు.

పాతాళంలో పాతి పెట్టినట్లుగా చెబుతున్న ఒక పార్టీ ఇచ్చిన పిలుపునకు ప్రజల్లో అంత ఆదరణ ఎందుకు వచ్చినట్లు? అంటే.. అది పార్టీ మీద ఉన్న ప్రేమ కంటే వారు లేవనెత్తిన అంశం మీదనే అంత స్పందన వచ్చినట్లుగా చెప్పాలి. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఓపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సాగునీటి శాఖామంత్రి హరీశ్ లు కరాఖండిగా చేస్తున్న వ్యాఖ్యలకు ధీటుగా ఏపీ అధికార.. విపక్ష నేతలు పెద్దగా స్పందించకపోవటంపై ఏపీ ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో చేపట్టిన నిరసన దీక్షకు స్పందన భారీగా వచ్చింది. సాగునీటి అంశంలో సీమాంధ్రుల్లో నెలకొన్న అసంతృప్తిని పొలిటికల్ మైలేజీగా మార్చుకోవటంతో పాటు.. విభజన కారణంగా తమ మీద పడ్డ మచ్చను చెరుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ నేతలు తొలి అడుగు వేశారని చెప్పాలి. సాగునీటి ప్రాజెక్టుల అంశానికి సంబంధించి బెజవాడలో చేపట్టిన నిరసన దీక్ష చెప్పేది ఒక్కటే.. సీమాంధ్రుల ప్రయోజనాల్ని దెబ్బ తీసే విషయం మీద ఏపీ అధికారపక్షం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తే.. కనుమరుగు అయినట్లుగా భావిస్తున్న కాంగ్రెస్ కు పునర్జన్మ ఇచ్చినట్లేనని మర్చిపోకూడదు. మరి.. తెలుగు తమ్ముళ్లు ఆ తప్పు చేస్తారా? లేదా? అన్నది కాలమే తేల్చాలి.