Begin typing your search above and press return to search.

జనం.. జనం...జగన్ ప్రభం 'జనం'

By:  Tupaki Desk   |   21 Aug 2018 2:30 PM GMT
జనం.. జనం...జగన్ ప్రభం జనం
X
ఏమిటీ జనం.... ఎక్కడి నుంచి ఈ ప్రభంజనం. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష నాయకుడు - వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలో చేస్తున్న పాదయాత్రకు జనం వెల్లువెత్తుతున్నారు. ఒక ఊరు అని లేదు... ఒక పల్లె అని లేదు. ఎక్కడికి వెళ్లినా జనం పుట్ట పగిలినట్టుగా వస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో వచ్చిన జనాన్ని చూసిన అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు తమ పరిస్థితి అర్ధం కావడం లేదు. కాపులకు రిజర్వేషన్లపై ఎలాంటి రాజకీయ దురుద్దేశ్యాలు లేకుండా ప్రకటనలు చేసిన జగన్ మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టాలని తెలుగుదేశం నాయకులు భావించారు. అయితే, ఆయనకు వస్తున్న జనస్పందన చూసిన తెలుగుదేశం నాయకులకు నోట మాట రావడం లేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ సభలకు వచ్చిన జనం డబ్బుల కోసమో.... ఫొటోల కోసమో... బిర్యానీ పొట్లాల కోసమో... బ్రాందీ బాటిళ్ల కోసమో వచ్చిన వారు కాదు. నిస్సందేహంగా.... తమ కష్టాలు కడతేర్చే నాయకుడ్ని చూడాలని - ఆయన ఇచ్చే భరోసాతో ఎన్నికల వరకూ వేచి చూడాలనే ఒకే ఒక్క ఆశతో వచ్చారు.

ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చిన జన స్పందనతో జగన్‌ పై మిగిలిన జిల్లాల్లో కూడా ఆశలు - అభిమానులు పెరుగుతున్నారు. విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన జగన్‌ కు అక్కడి ప్రజలు సాదర స్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడు వచ్చాడని ఎదురెళ్లి మరీ ఆహ్వానం పలికారు. జిల్లాలో ఏజెన్సీకి ముఖద్వారమైన నర్శీపట్నం పక్కనున్న చిన్న గ్రామాలైన కోటవురట్ల - నక్కపల్లిలో సోమవారం జరిగిన పాదయాత్రకు వచ్చిన విశేష స్పందనతో జిల్లా తెలుగుదేశం నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కోటవురట్ల - నక్కపల్లి గ్రామాల జనాభా కనీసం 15 వేలు కూడా దాటదు. ఆ మండలాల నుంచి - ఆ రెండు గ్రామాల నుంచి వచ్చిన వారి సంఖ్య దాదాపు రెండు లక్షల వరకూ ఉంటుందని ఓ అంచనా. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారనే సామెతను ఆ రెండు గ్రామాల ప్రజలు - ఆ రెండు మండలాల ప్రజలు నిరూపించారు. జగన్ కూడా తనను చూసేందుకు - అభిమానం చూపించేందుకు వచ్చిన వారితో ప్రవర్తించిన తీరు కూడా వారిని అభిమానాన్ని రెట్టింపు చేస్తోంది.

రాబో‍యే ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విజయానికి జగన్ సభలకు వస్తున్న జనాలే తార్కాణం అని విశాఖ జిల్లాకు చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. అలాగే విశాఖ జిల్లాలోని తెలుగుదేశం నాయకుల అవినీతి - అక్రమాలకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు జగన్‌కు నీరాజనాలు పలుకుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.