Begin typing your search above and press return to search.

షాకింగ్‌: చెన్నైకి బుర‌ద ఉప‌ద్ర‌వం పొంచి ఉందా?

By:  Tupaki Desk   |   21 April 2017 4:52 AM GMT
షాకింగ్‌: చెన్నైకి బుర‌ద ఉప‌ద్ర‌వం పొంచి ఉందా?
X
చిత్ర విచిత్ర‌మైన ముచ్చ‌ట్లు ఈ మ‌ధ్య‌న త‌మిళ‌నాడులో చోటు చేసుకుంటున్నాయి. రాజ‌కీయంగా హాట్ హాట్ గా మారిన ఈ వ్య‌వ‌హారానికి త‌గ్గ‌ట్లే.. ప్ర‌కృతి ప‌రంగా ఎదుర‌వుతున్న ఇబ్బందులు చెన్నై వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ‌ధ్య‌న వ‌ర‌ద‌లు ముంచెత్త‌టం.. చెన్నై మొత్తం అత‌లాకుత‌లం కావ‌టం లాంటివి తెలిసిందే. ఒక‌టి త‌ర్వాత మ‌రొక‌టి అన్న చందంగా ఎప్ప‌టిక‌ప్పుడు ఎదుర‌వుతున్న ప్ర‌తికూల ప‌రిస్థితులు చెన్నై వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

తాజాగా చెన్నైలోని ఒక ఇంటి నేల లోప‌లి నుంచి ఉబికి వ‌చ్చిన బుర‌ద చెన్నై వాసుల్ని బెంబేలెత్తేలా చేసింది. స‌ద‌రు ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ట‌న్నుల కొద్దీ బుర‌ద ఇప్పుడు షాకింగ్‌ గా మార‌ట‌మే కాదు.. ఈ బుర‌ద ఉప‌ద్ర‌వం త‌మ‌ను ఎంత ప్ర‌భావితం చేస్తుంద‌న్న భ‌యాందోళ‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకిలా జ‌రిగింద‌న్న దానిపై స‌రైన కార‌ణాన్ని చెప్ప‌టం లేదు. ఆస‌క్తి.. అంత‌కు మించిన ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న ఈ ఉదంతాన్ని చూస్తే..

చెన్నైలోని చాక‌లిపేట లోని ఒక ఇంట్లో ఉన్న‌ట్లుండి భూమి లోప‌ల నుంచి బుర‌ద ఉబికి వ‌చ్చింది. ఎక్క‌డ నుంచి వ‌చ్చిందో.. ఎలా వ‌స్తుందన్న‌ది ఆ ఇంటి వారు అర్థం చేసుకున్నంత‌లోనే.. ఆ బురద ప‌రిమాణం అంత‌కంత‌కూ పెరిగిపోవ‌ట‌మే కాదు.. అది ఏకంగా వీధుల్లోకి వ‌చ్చేసింది. అలా వ‌చ్చిన బుర‌ద ట‌న్నుల‌కొద్దీ బ‌య‌ట‌కు రావ‌టంతో.. ఏం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి. ఎందుకిలా జ‌రిగింది? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు చుట్టుముట్టాయి. ఇలా భూమి నుంచి ఉబికివ‌చ్చిన బుర‌ద దాదాపుగా నాలుగు గంట‌ల పాటు నాన్ స్టాప్ గా సాగింది. దీంతో.. ఆ ఇంట్లోని వారు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. వారితో పాటు అక్క‌డి స్థానికుల నోటి వెంట మాట రాని ప‌రిస్థితి.

భూగ‌ర్భంలో నుంచి అంత‌లా బుర‌ద ఎందుకు పొంగుకు వ‌చ్చింద‌న్న విష‌యాన్ని ప‌రిశీలించిన అధికారులు చెబుతున్న‌దేమంటే.. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు ప‌నుల్లో భాగంగా.. చాక‌లిపేట నుంచి తిరువొత్తియూర్ విమ్ కో న‌గ‌ర్ వ‌ర‌కూ సుమారు 9.5 కిలోమీట‌ర్ల మేర‌.. ట్రాక్ ప‌నులు షురూ చేశారు. ఈ ప‌నుల్లో భాగంగా.. భూగ‌ర్భంలో ప‌నులు నిర్వ‌హిస్తున్నారు. ఈ కార‌ణంగా భూమి లోప‌ల ఏర్ప‌డిన ఒత్తిడి కార‌ణంగా ఈ బుర‌ద మిశ్ర‌మం భూమి లోప‌ల నుంచి ఉబికి వ‌చ్చింద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మెట్రో రైలు ప‌నుల కార‌ణంగానే కొద్ది రోజుల కింద‌ట అన్నాసాలై రోడ్డు మీద భారీ గొయ్యి ఏర్ప‌డిన విష‌యాన్ని గుర్తుచేస్తున్నారు. మెట్రో రైలు ప‌నులు పూర్తి అయ్యే లోపు ఇలాంటి చిత్ర విచిత్రాలు మ‌రెన్ని చూడాల్సి వ‌స్తుందోన‌న్న ఆందోళ‌న‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/