Begin typing your search above and press return to search.

అదృశ్యాలపై తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   12 Jun 2019 3:48 PM GMT
అదృశ్యాలపై తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన
X
తెలంగాణలో గడచిన 45 రోజుల్లోనే వందలాది మంది అదృశ్యమయ్యారని, ఈ కిడ్నాప్ లపై ఫిర్యాదులు అందుతున్నా పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ నేడు ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చిన కథనం పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కేవలం 45 రోజుల్లోనే వందల మంది ప్రత్యేకించి యువతులు అదృశ్యమవుతున్నా.. పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారని సదరు పత్రిక సంచలన కథనాన్నే ప్రచురించింది. ఈ కథనంపై ఇతర వర్గాల మాట ఎలా ఉన్నా తెలంగాణ పోలీసు శాఖ మాత్రం చాలా సీరియస్ గానే తీసుకుంది. ఏకంగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగిపోయారు. అసలు సదరు పత్రిక రాసిన కథనం ఏ మేరకు వాస్తవమన్న విషయాన్ని నిగ్గు తేల్చేందుక పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక బేటీ నిర్వహించిన మహేందర్ రెడ్డి... ఆ పత్రిక కథనంలో పేర్కొన్నట్లుగా వందల మంది అదృశ్యమైన మాట వాస్తవమేనని, అయితే ఫిర్యాదులు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎప్పటికప్పుడు అదృశ్యమైన వారి ఆచూకీని కనుగొంటూనే ఉన్నారని ఆయన నిగ్గు తేల్చారు.

మొత్తంగా ఆ కథనం తెలంగాణ పోలీసుల ప్రతిష్ఠను మసకబార్చేదిగానే ఉందని భావించిన మహేందర్ రెడ్డి... మహిళా భద్రతకు సంబంధించి చీఫ్ గా వ్యవహరిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారిణి స్వాతి లక్రాను రంగంలోకి దించారు. అంతేకాకుండా వాస్తవాలేమిటో జనానికి తెలిసేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆమెకు మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో స్వాతి లక్రా... ఇప్పటిదాకా నమోదైన కిడ్నాప్ కేసులన్నింటినీ గుదిగుచ్చి.. అసలు కిడ్నాప్ అయిన వారెంతమంది - వారిలో యువతులు ఎందరు - పిల్లలెందరు - వృద్ధులెందరు అన్న వివరాలను క్రోడీకరించారు. కిడ్నాప్ కు గురైన వారిలో ఇప్పటిదాకా ఎంతమందిని తాము ట్రేసవుట్ చేశామన్న విషయాన్ని కూడా ఆమె లెక్క తేల్చారు. అనంతరం మీడియాకు ఓ సమగ్ర నివేదికనతో కూడిన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఇదే పత్రికా ప్రకటనను డీజీపీ తన ట్విట్టర్ లో యథావిధిగా పోస్ట్ చేశారు.

ఈ ప్రకటనలో ఏముందన్న విషయానికి వస్తే... ‘కిడ్నాప్‌ అవుతున్న వారిలో దాదాపు 85 శాతం మంది ఆచూకీ దొరుకుతోంది. ఆడా - మగా - చిన్నా - పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారు అదృశ్యమవుతున్నారు. పరీక్షా ఫలితాలు - ప్రేమ వ్యవహారాలు - వృద్ధుల పట్ల పిల్లల నిరాదరణ వంటి కారణాలు కూడా ఉన్నాయి. ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసుకుని - బాధిత కుంటుంబ సభ్యుల సహకారంతో వారి ఆచూకీ కనుగొనేందుకు శ్రమిస్తున్నాం. గస్తీ వాహనాలు - బ్లూకోల్ట్స్‌ - దర్యాప్తు అధికారులకు కిడ్నాపైన వారి ఫొటోలు అందిస్తున్నాం. అత్యాధునిక ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ విధానాన్ని కూడా వినియోగిస్తున్నాం. ప్రజలెవరూ ఆందోళనకు గురికావాల్సి న పనిలేదు. అదృశ్యమైన ప్రతి ఒక్కరి ఆచూకీ కనుగొనేందుకు పోలీసుశాఖ పనిచేస్తుంది‘ అని ఆ ప్రకటనలో లక్రా పేర్కొన్నారు. మొత్తంగా కిడ్నాప్ లపై సదరు పత్రిక రాసిన కథనంపై డీజీపీ చాలా గుర్రుగా ఉన్నారని, అందుకే వెనువెంటనే స్వయంగా రంగంలోకి దిగి వాస్తవ పరిస్థితిని వెల్లడించేలా చర్యలు తీసుకున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.