Begin typing your search above and press return to search.

అంబానీ మొద‌లు అంద‌రూ ఆయ‌న శిష్యులే!

By:  Tupaki Desk   |   5 Nov 2018 5:21 AM GMT
అంబానీ మొద‌లు అంద‌రూ ఆయ‌న శిష్యులే!
X
కాస్త వ‌య‌సు పెరిగినంత‌నే ఇంట్లోనే కాదు బ‌య‌టా ప‌ట్టించుకోవటం అనేది ఉండ‌దు. ఇది చాలామందికి చాలా చోట్ల ఎదుర‌య్యే అనుభ‌వం. కానీ.. కొంద‌రికి మాత్రం మిన‌హాయింపు ఉంటుంది. అలాంటి కోవ‌కే చెందుతారు 96 ఏళ్ల పండిట్ నాథూలాల్ బైరూలాల్ వ్యాస్‌. ఆయ‌న ప్ర‌త్యేక‌త ఏమిటంటారా?

రాజ‌స్థాన్‌లోని మారుమూల ప్రాంతంలో ఉండే ఆయ‌న కోసం ఒక మోస్త‌రు రాజ‌కీయ నేత‌లు మొద‌లుకొని కేంద్ర‌మంత్రులు.. రాష్ట్ర ముఖ్య‌మంత్రులే కాదు.. ఏకంగా దేశాన్ని విప‌రీతంగా ప్ర‌భావితం చేసే ముఖేశ్ అంబానీ సైతం ఆయ‌న్ను క‌లుసుకోవ‌టం కోసం.. ఆయ‌న మాట కోసం వెయిట్ చేస్తుంటారు.

ఇంత‌కీ ఆయ‌న స్పెషాలిటీ ఏమిటి? అంటే.. ఆయ‌నో జ్యోతిష్యుడు. అలా అని అల్లాట‌ప్పా ఎంత‌మాత్రం కాదు. ఆయ‌న పాటించే విధానం ప్ర‌కారం జ‌ర‌గ‌బోయేది చెప్ప‌టం ఆయ‌న‌కు అల‌వాటు. దేశంలోనే కాదు.. విదేశాల‌కు సంబంధించి ప‌లువురు ఈ పెద్దాయ‌న మాట కోసం.. ద‌ర్శ‌నం కోసం త‌హ‌త‌హ‌లాడిపోతుంటారు.

ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌.. వ్యాస్ కు డిమాండ్ మ‌రింత పెరిగింది. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిస్తే ఆ కిక్కే వేరు. త‌న‌కు అనుకూలంగా జరిగే అంశాల్ని ముందే తెలుసుకొని ఎక్సైట్ అవుతూ వెయిట్ చేయ‌టం.. చెడు జ‌రిగే వాటి నివార‌ణ‌కు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉంటారు.

రాజ‌స్థాన్ లోని భిల్వారాకు 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉండే చిన్న గ్రామ‌మైన క‌రోయ్ లో వ్యాస్ ఉంటారు. ఎన్నిక‌ల సీజ‌న్ కావ‌టంతో ఆయ‌న ఆశీస్సుల కోసం ఇప్పుడు నేత‌లు క్యూ క‌డుతున్నారు. ఆయ‌న చెప్పే జోస్యాలు ఎంత‌లా నిజ‌మ‌వుతాయ‌న్న విష‌యానికి ఒక పెద్ద ఉదాహ‌ర‌ణ‌ను ప్ర‌స్తావిస్తూ ఉంటారు. దేశ రాష్ట్రప‌తిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన ప్ర‌తిభాసింగ్ పాటిల్ రాష్ట్రప‌తి కుర్చీలో కూర్చోనున్నట్లు ఆమెకు.. ప్ర‌తిభ‌ భ‌ర్త‌కు ముందే వ్యాస్ చెప్పేయటం గ‌మ‌నార్హం. ఇలా వ‌ర్త‌మానంలో భ‌విష్య‌త్తును క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా చెప్పే ఆయ‌న ఆశీస్సులు కోసం ముకేశ్ అంబానీ త‌ర‌చూ క‌లుస్తుంటారు. ఆయ‌న శిష్య ప‌ర‌మాణువుల జాబితాలో ప‌లువురు కేంద్ర‌మంత్రులు.. రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌రా రాజె ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. ఎందుకైనా మంచిది తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెవిలో ఈ పెద్ద మ‌నిషి గురించి.. ఆయ‌న గొప్ప‌త‌నం గురించి.. ఆయ‌న జోస్యం గురించి కాస్త స‌మాచారాన్ని అందిస్తే మంచిదేమో?