Begin typing your search above and press return to search.

ఇక్కడ కాంగ్రెస్-టీడీపీ బిగ్ ఫైట్ తప్పదా.?

By:  Tupaki Desk   |   22 Sep 2018 6:19 AM GMT
ఇక్కడ కాంగ్రెస్-టీడీపీ బిగ్ ఫైట్ తప్పదా.?
X
మహాకూటమి తొందరగానే ఏర్పడింది. కానీ సీట్ల సర్ధుబాటే ఇంకా కొలిక్కి కావడం లేదు. టీజేఎస్ కోందడరాం.. టీడీపీ సీట్లు ఎక్కువ అడగడంతో పీటముడి నెలకొంది. కానీ టీడీపీ తాజాగా మెట్టు దిగే గెలిచే సీట్లలోనే పోటీచేయాలని డిసైడ్ అయ్యింది. అంతా బాగానే ఉంది. కాంగ్రెస్ కూడా సంతోషం వ్యక్తం చేసింది. కానీ ఇప్పుడు టీడీపీ - కాంగ్రెస్ లు ఇప్పుడు ఆ ఒక్క నియోజకవర్గం పైనే పట్టు వదలకుండా ఉన్నాయట..

గెలిచే సీట్లను కోరాలని భావిస్తున్న టీడీపీ జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా పోటీచేయాలని పట్టుదలతో ఉందట..అటు కాంగ్రెస్ కూడా జూబ్లీహిల్స్ ను మిత్రపక్షాలకు ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఉందట.. దీంతో జూబ్లిహిల్స్ కోసం మిత్రపక్షాలు కాంగ్రెస్ - టీడీపీల మధ్య సవాల్ తప్పదా అనే టెన్షన్ ఇరు వర్గాల్లోనూ గుబులు పుట్టిస్తోంది.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ఓటమి పాలైంది. ఆ పార్టీ అభ్యర్థి విష్ణు వర్ధన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచింది. టీడీపీ ఈ నియోజకవర్గంలో గెలిచింది. తెలుగుదేశం నుంచి గెలిచిన మాగంటి గోపినాథ్ ఆ తర్వాత కారెక్కేశారు. ఇప్పుడు టీఆర్ ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. విష్ణువర్ధన్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి పోటీకి విష్ణువర్ధన్ రెడ్డి రెడీ అవుతున్నారట.. ఈసారి టీడీపీ ఓటు బ్యాంకు కూడా తనకే వస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే టీడీపీ 10శాతం ఎక్కువ ఓటు బ్యాంకు సాధించడం విశేషం.

అయితే అదే సమయంలో సీన్లోకి సినీ నిర్మాత బండ్ల గణేష్ వచ్చాడు. జూబ్లీహిల్స్ టికెట్ ను ఆశిస్తూ ఆయన కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ సమక్షంలో చేరినట్టు సమాచారం. జబ్లీహిల్స్ నియోజకవర్గంలో లక్షకు పైగా ఉన్న మైనార్టీ ఓటర్లు, ఆంధ్రా వలస ఓటర్లే గెలుపోటముల్లో కీలకంగా ఉన్నారు. వీరంతా గత ఎన్నికల్లో టీడీపీకి ఓటేశారు. ఈసారి టీడీపీ-కాంగ్రెస్ పొత్తు కుదిరితే ఈ అభ్యర్థికే వేస్తారనే నమ్మకం ఏర్పడింది. దీంతో ఇక్కడ కూటమి తరఫున ఎవరు నిలబడ్డా ఖచ్చితంగా గెలుస్తామని భావిస్తున్నారు.

టీడీపీ ఇప్పటికే తాము గెలిచే స్థానాలేంటనే దానిపై 3 కోణాల్లో సర్వే చేయించిందట.. అందులో ఖచ్చితంగా గెలిచే స్థానంగా జూబ్లీహిల్స్ తేలిందట.. దీంతో జూబ్లీహిల్స్ కావాలని టీడీపీ.. మరో వైపు పోటీచేసి తీరుతానని కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి పంతం పట్టారు. ఈ కీలక స్థానం ఎవరికి దక్కుతుందనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.