Begin typing your search above and press return to search.

జగన్ మెజారిటీపై ఆసక్తికర పందేలు

By:  Tupaki Desk   |   22 April 2019 4:30 PM GMT
జగన్ మెజారిటీపై ఆసక్తికర పందేలు
X
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల హడావుడి నెలకొంది. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఐతే కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వస్తుందనే ఆసక్తి ఏ స్థాయిలో ఉందో.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే ఆసక్తి కూడా దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో అదే స్థాయిలో ఉంది. ఈసారి ఏపీలో ఎన్నికల్ని ప్రధాన పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయం అన్నది మెజారిటీ సర్వేల మాట. వైకాపా అధినేత జగన్ ఈసారి సీఎం కావడం పక్కా అంటున్నారు. ఫలితాలకు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉండటంతో బెట్టింగ్ రాయుళ్లు చాలా యాక్టివ్‌గా ఉన్నారిప్పుడు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పందేలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల మీద తెలంగాణలో సైతం బెట్టింగ్ సాగుతోంది.

ఓవరాల్‌ గా ఎన్నికల ఫలితాల గురించే కాక.. ఒక్కో నియోజకవర్గం మీద కూడా పందేలు నడుస్తున్నాయి. అభ్యర్థుల మెజారిటీల మీద కూడా ఫ్యాన్సీ బెట్టింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా పులివెందులలో జగన్ మెజారిటీ మీద అందరి దృష్టీ నిలిచి ఉంది. ఈసారి అక్కడ రికార్డు స్థాయి మెజారిటీ ఖాయమంటున్నారు. అటువైపు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కంటే జగన్ మెజారిటీ కచ్చితంగా ఎక్కువ ఉంటుందనడంలో మరో మాట లేదు. దీని మీద పందేలు కాసే పరిస్థితి లేదు. బెట్టింగ్ రాయుళ్లు జగన్ మీద ఉన్న నమ్మకంతో చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ మెజారిటీ కలిపినా వైకాపా అధినేత మెజారిటీ కంటే తక్కువ ఉంటుందనే ధీమాతో ఈ మేరకు బెట్టింగులు కాస్తుండటం విశేషం. లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. లోకేష్ గెలుపు మీదే సందేహాలుండగా.. గెలిచినా పెద్ద మెజారిటీ ఉండదన్నది జగన్ అభిమానుల ధీమా. కాబట్టి జగన్ మెజారిటీ.. చంద్రబాబు, లోకేష్ ఇద్దరి మెజారిటీ కలిపినా కూడా ఇంకా ఎక్కువ ఉంటుందని పందేలు కాస్తున్నారట.