Begin typing your search above and press return to search.

అంత గొప్ప ఎన్టీఆర్ లక్షీపార్వతికి ఎలా పడిపోయాడో?: వర్మ

By:  Tupaki Desk   |   20 Sep 2017 6:15 PM GMT
అంత గొప్ప ఎన్టీఆర్ లక్షీపార్వతికి ఎలా పడిపోయాడో?: వర్మ
X
ఎన్టీఆర్ అంటే రాజకీయాలు, సినిమాలు రెండిట్లోనూ టాప్ హీరోయే. ఎందరో అందమైన హీరోయిన్లతో ఆడిపాడిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తరువాత చాలాకాలానికి లక్షీపార్వతిని రెండో వివాహం చేసుకోవడం తెలుగు రాజకీయాలనే మలుపుతిప్పేసింది. దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఆ పరిణామాలు తాజా వార్తలుగానే ఉంటున్నాయంటే వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఎలా ఉన్నా.... వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఎన్టీఆర్ పై సినిమా తీయడానికి రెడీ అవుతుండడం.. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఇది హాట్ టాపిక్ అయింది. రాంగోపాల్ వర్మ తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ రెండో పెళ్లిపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. జయప్రద, శ్రీదేవి వంటి అలనాటి అందాల తారలతో నటించిన ఆయన సాధారణ మహిళ అయిన లక్ష్మీపార్వతి పట్ల ఎలా ఆకర్షితులయ్యారో తెలుసుకోవాలన్న కోరిక తనకు కలిగిందని.. అందుకే ఎన్టీఆర్ జీవితంలోని పలు పరిణామాలను, కీలక ఘట్టాలను స్టడీ చేసి ఈ సినిమా తీస్తున్నానని ఆయన వివరించారు.

కాగా, రామారావు జీవిత చరిత్రపై తీస్తున్న సినిమాకు ఆయన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే టైటిల్‌ను పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాను లక్ష్మీపార్వతి దృష్టికోణం నుంచి తీయ‌బోతున్నాన‌ని ఆయన ప్రకటించారు. గత కొన్నాళ్లుగా ఆయన ఈ విషయంపై మాట్లాడుతుండడంతో అటు టీడీపీలో కూడా దీనిపై కాస్త కంగారు పడుతోంది. అసలే వర్మ... ఆపై ఎన్టీఆర్ పై సినిమా... దీంతో ఆయన ఏం చూపిస్తారో.. ఎవరిని విలన్ చేస్తారో అని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వర్రీ అవుతున్నట్లు టాక్.

టీడీపీ ఆందోళనను మరింత పెంచేలా వర్మ ఈ రోజు తన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ‌యోపిక్ అంటే ఓ మ‌నిషి పుట్టిన‌ప్ప‌టి నుంచి చ‌నిపోయేవ‌ర‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా తీస్తార‌ని, అలా కాకుండా ఓ కీల‌క సంఘ‌ట‌న నుంచి కూడా మొద‌ల‌వుతుంద‌ని చెప్పారు. గ‌తంలో మ‌హాత్మాగాంధీ బ‌యోపిక్‌ని ఆయ‌నను రైల్లోంచి తోసేసిన ఘ‌ట‌న నుంచి మొద‌లు పెట్టార‌ని వర్మ గుర్తు చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో తాను కూడా రామారావు జీవితంలో జ‌రిగిన కీల‌క సంఘ‌ట‌న నుంచి మొద‌లుపెడ‌తాన‌ని చెప్పారు. దీంతో అది ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సీనుతో మొదలవుతుందన్న ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది.