Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు మంట పుట్టిస్తున్న జ‌గ‌న్‌!

By:  Tupaki Desk   |   12 Jun 2019 7:11 AM GMT
కేసీఆర్ కు మంట పుట్టిస్తున్న జ‌గ‌న్‌!
X
వ‌య‌సు చిన్న‌ది.. బాధ్య‌త పెద్ద‌ది అంటూ పెద్ద‌రికంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు ప‌దే ప‌దే గుర్తుకు తెచ్చేలా చేస్తున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌. సీఎం ప‌ద‌వి చేప‌ట్టానికి వ‌య‌సు కంటే స‌మ‌ర్థ‌తే ముఖ్య‌మ‌న్న విష‌యాన్ని ఏపీ ప్ర‌జ‌లు గుర్తించినా.. కేసీఆర్ ఆ విష‌యంలో త‌ప్పులో కాలేశార‌ని చెప్పాలి. జ‌గ‌న్ ను అర్థం చేసుకోవ‌టంలో ఆయ‌న స‌రైన మ‌దింపు చేయ‌లేద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

వ‌య‌సులో చిన్నోడు.. మ‌న మాట వింటాడు.. మ‌నం చెప్పిన‌ట్లు వింటాడ‌న్న భావ‌న టీఆర్ ఎస్ ముఖ్య‌నేత‌ల్లో ఉండేద‌న్న మాట టీఆర్ ఎస్ వ‌ర్గాలు త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో వినిపిస్తుంటాయి. కానీ.. తాము ఏ మాత్రం ఊహించ‌ని రీతిలో జ‌గ‌న్ తీరు ఉంద‌ని.. అత‌గాడి ప్లానింగ్ చూస్తుంటే.. కేసీఆర్ కు సైతం చెమ‌ట‌లు ప‌ట్టేస్తున్నాయ‌న్న మాట రాజ‌కీయ వ‌ర్గాల్లో అంత‌కంత‌కూ పెరుగుతోంది.

జ‌గ‌న్ స్పీడ్ కు కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు గులాబీ బాస్ మీద విప‌రీత‌మైన ఒత్తిడికి గురి చేయ‌టంతో పాటు.. త‌ప్ప‌నిస‌రిగా వాటిని ఫాలో కావాల్సిన ప‌రిస్థితి వచ్చిందంటున్నారు. గ‌డిచిన మూడు రోజులుగా చూస్తే.. తెలంగాణ‌లోని వివిధ ప్రాంతాల్లో ధ‌ర్నాలు.. ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. వీటికి స్ఫూర్తి ఏపీలో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు కావ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. కేసీఆర్ కు వ‌చ్చిన మ‌రో ఇబ్బంది ఏమంటే.. ఇప్పుడు ప‌లు అంశాల మీద సానుకూల నిర్ణ‌యం తీసుకున్నా.. ఆ క్రెడిట్ అంతా జ‌గ‌న్ ఖాతాకు పోతుందే త‌ప్పించి.. త‌న ఖాతాలోకి రాని ప‌రిస్థితి.

చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు.. దూకుడు నిర్ణ‌యాల‌తో మైలేజీ పొందిన కేసీఆర్‌.. ఇప్పుడు అందుకు భిన్న‌మైన అనుభ‌వం ఆయ‌న‌కు ఎదుర‌వుతోంది. ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీన నిర్ణ‌యం.. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌.. కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం ల‌కు సంబంధించి జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల్ని త‌ప్ప‌నిస‌రిగా ఫాలో కాక త‌ప్ప‌దు. ఐఆర్ ను 27 శాతం పెంచ‌టానికి కేసీఆర్ సుముఖంగా లేరు. అలా అని పెంచ‌కుంటే జ‌గ‌న్ తో పోల్చి విమ‌ర్శ‌ల‌కు గురి కావ‌టం ఖాయం.

త‌న దూకుడుతో తెలంగాణ సీఎంకు జ‌గ‌న్ కొత్త స‌వాళ్లు.. స‌మ‌స్య‌లు తీసుకొస్తున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మార‌ట‌మేకాదు.. గులాబీ నేత‌ల్లో కొత్త ద‌డ మొద‌లైన‌ట్లుగా చెప్పాలి. త‌న‌కు మ‌రెవ‌రితో సంబంధం లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి కొత్త ఇబ్బందిగా మారార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.