Begin typing your search above and press return to search.

'కీ' పాయింట్; ఎందుకు హైదరాసాగర్ అంటే..?

By:  Tupaki Desk   |   22 Sep 2016 4:01 AM GMT
కీ పాయింట్; ఎందుకు హైదరాసాగర్ అంటే..?
X
మంగళవారం రాత్రి ఎనిమిది గంటల వరకూ హైదరాబాద్ లో సాధారణ పరిస్థితులే ఉన్నాయి. సగటు వర్షాకాలం సాయంవేళ ఆకాశంలో ఎలాంటి మబ్బులు కమ్మాయో.. అలాంటి మబ్బులే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తరచూ పడే మాదిరే కొన్నిచోట్ల.. వర్షం.. మరికొన్ని చోట్ల వాన ఛాయలు లేని పరిస్థితి. ఇదంతా రాత్రి తొమ్మిది గంటల వరకే. తొమ్మిది దాటిన తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

చిన్న చినుకులుగా మొదలైన వాన.. గంటలు గడిచే కొద్దీ.. భారీ వర్షంగా మారింది. ఎడతెరపి లేకుండా.. ఆకాశానికి చిల్లులు పడినట్లుగా వాన కురిసిన పరిస్థితి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ నాన్ స్టాప్ గా కురిసిన వర్షం తీవ్రత ఎంతన్నది ఒక్క మాటలో చెప్పాలంటే.. హైదరాబాద్ కాస్తా.. హైదరాసాగర్ లా మారిపోయిన పరిస్థితి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావటమే కాదు.. గడిచిన పదేళ్లలో జలమయం అన్న మాట తెలీని ఎన్నో ప్రాంతాల్లో జలదిగ్బంధనానికి గురైన పరిస్థితి. ఎందుకిలా అంటే.. నాన్ స్టాప్ గా కురిసిన వర్షపాతంగా చెప్పాలి.

అప్పుడెప్పుడో 1908లో భాగ్యనగరిని ఉక్కిరిబిక్కిరి చేసిన భారీ వర్షపాతం మరోసారి పునరావృతమైంది. మూసీ వరదల సమయంలో 15.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయానికి కురిసిన వర్షం 16.7 సెంటీమీటర్లు కావటం గమనార్హం. 2000 సంవత్సరంలో 24 సెంటీమీటర్ల భారీ వర్షపాతం తర్వాత.. మంగళవారం రాత్రి కురిసిందే రెండో అత్యధిక వర్షపాతం. ఈ కారణంతోనే హైదరాబాద్ కాస్తా హైదరాసాగర్ గా మారిపోయిన దుస్థితి.

దీనికి తోడు నల్లాల్ని ఆక్రమించుకొని ఇష్టారాజ్యంగా భవనాలు కట్టేసిన బిల్డర్లు.. మౌలిక సదుపాయాలు అన్నవి ఏ మాత్రం లేకున్నా.. లంచాలకు మరిగిన అధికారులు పర్మిషన్లు ఇచ్చేయటంతో నగరంలోని ఎన్నో ప్రాంతాలు జలవిలయానికి చిక్కుకొని విలవిలలాడిన పరిస్థితి. మామూలుగానే ఆరేడు సెంటీమీటర్ల వర్షం పడితేనే నగరం గజగజ వణికే పరిస్థితి. అలాంటిది దాదాపు ఎనిమిది.. తొమ్మిది గంటల వ్యవధిలో 16 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదు కాగా.. కొన్ని ప్రాంతాల్లో కేవలం రెండు.. మూడు గంటల వ్యవధిలోనే భారీ వర్షం కురిసింది. దీంతో అపార్ట్ మెంట్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది. వేలాది మంది తీవ్ర నష్టానికి గురి కాగా.. లక్షలాది మంది తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.

నగరం గాఢ నిద్రలో ఉన్న వేళ.. ప్రకృతి ప్రకోపంతో.. నగరవాసులు అలెర్ట్ అయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోవటమే కాదు.. కళ్లు తెరిచి.. నిద్రమత్తు వదిలేసరికి.. నిలువెత్తు నీళ్లలో నగరం నిండిన దుస్థితి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగా హెచ్చరించినా.. వర్షపు తీవ్రత ఎంత స్థాయిలో ఉంటుందన్న అంచనాలో జరిగిన పొరపాటు.. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కలిసి.. సగటు జీవికి చుక్కలు కనిపించాయి. ఆసక్తికరమైన మరో అంశం ఏమిటంటే.. ఈ దఫా అత్యధిక వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు ఉండటం గమనార్హం. వీరు ఎక్కువగా ఉండే నిజాంపేట.. మియాపూర్.. కూకట్ పల్లి.. శేరిలింగంపల్లి.. కుత్బుల్లాపూర్ (ఈ రెండు ప్రాంతాలతో పోలిస్తే తక్కువే) ప్రాంతాల్లో వాన విశ్వరూపాన్ని ప్రదర్శించే క్యుములోనింబస్ మేఘాలు వ్యాపించటంతో నష్టం మరింత ఎక్కువైంది.