Begin typing your search above and press return to search.

ఇండో అమెరికన్ జంట భారీ విరాళం!

By:  Tupaki Desk   |   26 Sep 2017 1:03 PM GMT
ఇండో అమెరికన్ జంట భారీ విరాళం!
X
గ‌త నెల‌లో అమెరికా పై విరుచుకుప‌డ్డ హ‌రికేన్ హార్వీ ధాటికి 70 మంది మ‌ర‌ణించ‌గా - 30 వేల మంది నిరాశ్ర‌యులైన సంగ‌తి తెలిసిందే. ఈ పెను తుపాను ధాటికి వేల కోట్ల రూపాయ‌ల ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. అమెరికా చరిత్ర‌లోనే వెట్టెస్ట్ ట్రోపికల్ సైక్లోన్ హార్వీ బాధితుల స‌హాయార్థం ఓ భార‌తీయ అమెరిక‌న్‌ జంట భారీ విరాళాన్ని ప్ర‌క‌టించింది. ఈ హ‌రికేన్ ధాటికి నిరాశ్ర‌యులైన‌వారి కోసం 1.6 కోట్ల రూపాయ‌ల‌ను హరికేన్‌ హార్వీ రిలీఫ్ ఫండ్ కు విరాళ‌మిచ్చింది. ఆదివారం హూస్టన్‌ లో జరిగిన కార్యక్రమంలో గ్రేటర్‌ హూస్టన్‌ కమ్యూనిటీ ఫౌండేషన్‌ తరఫున అమిత్‌ భండారీ - ఆయ‌న భార్య‌ అర్పితా భండారీలు ఈ విరాళాన్ని హూస్టన్‌ మేయర్‌ సిల్వెస్టర్‌ టర్నర్‌ కు అందజేశారు.

హ‌రికేన్ హార్వీ ధాటికి నిరాశ్ర‌యులైన వారికి పున‌రావాసం క‌ల్పించ‌డం ఈ రిలీఫ్ ఫండ్ ప్ర‌ధాన ఉద్దేశం. బయోఉర్జా గ్రూప్‌ కు వ్య‌వ‌స్థాప‌కుడిగా - సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌అమిత్ భండారీ త‌న వంతుగా 1.6 కోట్ల‌ను ఫండ్ కు డొనేట్ చేశారు. హూస్ట‌న్ లో ఉన్న ఈ అగ్రిక‌ల్చ‌ర‌ల్ క‌మోడిటీ ట్రేడింగ్ కంపెనీకి ప్ర‌పంచ‌వ్యాప్తంగా బ్రాంచిలున్నాయి. ఇటువంటి సేవాకార్య‌క్ర‌మాల‌లో భండారీ దంప‌తులు ముందుంటారు. గ్రేటర్‌ హూస్టన్‌ కమ్యూనిటీ ఫౌండేషన్‌ ద్వారా దాదాపుగా 700 మందిని రక్షించామని అమిత్‌ భండారీ తెలిపారు. బాధితుల సహాయార్థం వివిధ చారిటీలకు ఫౌండేషన్‌ ద్వారా రూ.9.7కోట్లు సమకూర్చామని అన్నారు. మేయ‌ర్ కు విరాళాన్ని అంద‌జేసే సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఫౌండేష‌న్ స‌భ్యులు భండారీ దంప‌తుల‌ను అభినందించారు. వారు చేస్తున్న సేవ‌ల‌ను కొనియాడారు.

హార్వీ బాధితులను ఆదుకోవటానికి భారతీయ అమెరికన్‌లు చొర‌వ చూప‌డం సంతోష‌క‌ర‌మ‌ని మేయ‌ర్‌ టర్నర్ అన్నారు. ప్ర‌త్యేకించి భండారీ దంప‌తుల‌ను ఆయ‌న అభినందించారు. హార్వీ ఫండ్ కోస‌మే కాకుండా, చాలా కాలం నుంచి హూస్టన్‌ నగరాభివృద్ధికి భారతీయులు కృషి చేస్తున్నార‌న్నారు. ఈ ఫండ్ ద్వారా భ‌విష్య‌త్తులో వచ్చే తుపానులను మరింత సమర్ధవంతగా ఎదుర్కొనేలా నగరాన్ని పునర్‌నిర్మిస్తామని చెప్పారు. కాగా, గ‌త నెల‌లో హ‌రికేన్ హార్వీ ధాటికి అమెరికా చిగురుటాకులా వ‌ణికిపోయింది. హార్వీ ధాటికి అమెరికాలోని కొన్ని ప్రాంతాల‌లో నాలుగు గంట‌ల వ్య‌వ‌ధిలో 100 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఆ వ‌ర‌ద‌ల ధాటికి భారీగా ఆస్తిన‌ష్టం సంభ‌వించింది. దాదాపు 30 వేల మంది నిరాశ్ర‌యుల‌య్యారు. హార్వీ ధాటికి 70 మంది మ‌ర‌ణించారు. ముఖ్యంగా టెక్సాస్ పై హార్వీ ప్ర‌భావం అధికంగా ఉంది.