పేరుకే ఫైవ్ స్టార్ హోటల్..తెలిస్తే షాకే!

Sun Jan 21 2018 10:18:43 GMT+0530 (IST)

ఫైవ్ స్టార్ హోటల్ అన్న వెంటనే అంచనాలు భారీగా ఉంటాయి. టిప్పు టాపుగా కనిపించే హోటల్లో ఆవరణను చూసి మురిసిపోతే తప్పులో కాలేసినట్లేనన్న విషయాన్ని జీహెచ్ ఎంసీ అధికారులు తేల్చేశారు. హైదరాబాద్ లోని నానక్ రాం గూడలో అందరికి సుపరిచితమైన స్టార్ హోటల్ హయత్ కు లక్షలాది రూపాయిలు ఫైన్ విధించటం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.గల్లీల్లో ఉండే హోటళ్లతో పోలిస్తే.. హోటల్ హయత్ కిచెన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయాన్ని తాజాగా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బయటపడింది. పేరుకు ఫైవ్ స్టార్ హోటలనే కానీ.. కిచెన్ లో వెజ్.. నాన్ వెజ్ కు వేర్వేరు ఫ్రిజ్ లు లేకపోవటమే కాదు.. డ్రైనేజీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూసిన అధికారులు షాక్ తిన్నారు. సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించిన  శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ మమత హయత్ లీలల్ని గుర్తించారు.

భారీగా వ్యాపారం చేస్తున్నా.. కొంతకాలంగా ట్రేడ్ లైసెస్స్ ఫీజు చెల్లించకపోవటాన్ని గుర్తించారు. అంతేకాదు.. జీహెచ్ ఎంసీ ముద్ర లేకుండా మాంసాన్ని వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. అంతేకాదు.. కిచెన్ లో తడి.. పొడి చెత్తను వేరు చేసేలా ఏర్పాట్లు లేకపోవటం.. వెజ్.. నాన్ వెజ్ ను ఒకే ఫ్రిజ్ లో ఏర్పాటు చేయటాన్ని తీవ్రంగా పరిగణించారు. అంతేకాదు.. ఫైర్ స్టేఫీ లేదని.. మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవటంతో పాటు.. రూల్స్ బ్రేక్ చేసేలా హోటల్ నిర్వహణ ఉండటంతో హోటల్ కు భారీగా జరిమానాను విధించారు.

అపరాధ రుసుముగా రూ.26వేలతో పాటు.. చాలా కాలంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించకుండా హోటల్ నిర్వహిస్తుండటంతో రూ.13.65 లక్షలు వసూలు చేశారు. రూల్స్ ను బ్రేక్ చేసేలా హోటల్ ను నిర్వహించటంపై కేసును నమోదు చేశారు. ఈ ఉదంతాన్ని చూసినప్పుడు ఫైర్ స్టార్ హోటళ్లకు వెళ్లాలన్న భయం కలగటం ఖాయం.