Begin typing your search above and press return to search.

అమరావతికి వెళ్లే ఉద్యోగులకు సరికొత్త ‘‘వసతి’’

By:  Tupaki Desk   |   26 May 2016 5:06 AM GMT
అమరావతికి వెళ్లే ఉద్యోగులకు సరికొత్త ‘‘వసతి’’
X
మరో నెల రోజుల్లో హైదరాబాద్ లో పని చేస్తున్న ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతికి వెళ్లాల్సిన పరిస్థితి. ఎట్టిపరిస్థితుల్లో జూన్ చివరి నాటికి ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్న ఏపీ సర్కారు ఆలోచనకు ఓకే అనే వాళ్లే కాదు.. నో అంటే నో అనే వాళ్లూ ఉన్నారు. అలాంటి ఉద్యోగులు చేసే ఫిర్యాదు ఒక్కటే.. అమరావతితో తాము ఉండటానికి వీలైన సౌకర్యాలు లేవని.. తమను తీసుకెళ్లటం ద్వారా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందంటున్నారు.

అయితే.. అమరావతిలో పరిస్థితి మరీ అంత దారుణంగా లేదన్న విషయం.. తాజాగా హైదరాబాద్ సచివాలయంలోని ప్రతి బ్లాక్ లో దర్శనమిస్తున్న ఒక కరపత్రం చూస్తే తెలుస్తుంది. అతిథి హోమ్స్ పేరిట కనిపించే ఈ కరపత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. ఏపీ సచివాలయ ఉద్యోగులలో పెద్ద చర్చనే లేవనెత్తింది. జూన్ నెలాఖరకు అమరావతిలో నిర్మిస్తున్న ఏపీ సచివాలయానికి హైదరాబాద్ లోని ఏపీ సచివాలయ ఉద్యోగులు వెళ్లాల్సిన నేపథ్యంలో.. వారు ఉండటానికి ఇళ్లు పెద్ద ఇబ్బందిగా మారాయన్న విషయం తెలిసిందే.

ఇళ్ల సమస్య ఒకటైతే.. ఏళ్లకు ఏళ్లు హైదరాబాద్ లో సెటిల్ అయి.. ఇప్పటికిప్పుడు హైదరాబాద్ వదిలి వెళ్లటం చాలామంది ఉద్యోగుల కుటుంబాలకు ఇబ్బందికరంగా మారింది. పిల్లల చదువులు.. ప్రైవేటు ఉద్యోగాలు.. ఆసుపత్రి సమస్యలు ఇలా ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు సర్కారు తాజాగా వారానికి ఐదు రోజుల పని వెసులుబాటును తెర మీదకు తీసుకురావటం తెలిసిందే.

దీంతో.. హైదరాబాద్ లో కమిట్ మెంట్స్ ఉన్న వందలాది ఉద్యోగులకు ఫ్యామిలీని అమరావతికి తరలించకుండా ఉండే వెసులుబాటు కల్పించేలా చేసింది. వారానికి ఐదు రోజులు పని.. రెండు రోజులు సెలవులు రావటంతో.. ఫ్యామిలీకి దూరంగా ఉన్నామన్న భావన కలగదు. అయితే.. ఇలాంటి ఫోర్సుడ్ బ్యాచిలర్లకు వచ్చే ఇబ్బంది వసతి సౌకర్యం. ఇంటిని తీసుకోలేరు. ఒకవేళ ఇంటిని తీసుకున్నా వంట లాంటి ఇబ్బందులు ఉండనే ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులకు చెక్ చెప్పేందుకు వీలుగా.. ఉద్యోగుల కోసం ప్రత్యేక హాస్టల్స్ ను ప్రైవేటు వ్యక్తులు సిద్ధం చేశారు.

రెండు పూటలా భోజనంతో పాటు.. రూమ్ ని ఇద్దరు.. ముగ్గురు షేర్ చేసుకునే సౌకర్యం.. ఏసీ.. నాన్ ఏసీ వసతి కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలు తాజాగా ఏపీ సచివాలయంలోని ప్రతి బ్లాక్ లోనూ సదరు హాస్టల్స్ నిర్వాహకులు పంచి వెళుతున్నారు.

ఏపీ సచివాలయానికి కేవలం కిలో మీటరు దూరంలో ఇలాంటి హాస్టల్స్ ను నిర్మించిన పలువురు ప్రైవేటు వ్యక్తులు.. ఒక్కసారి వచ్చి తమ హాస్టల్స్ ను చూడాలని కోరుతున్నారు. వారంలో ఐదు రోజులు మాత్రమే పని దినాలైన నేపథ్యంలో.. ఇంటిని తీసుకొని.. భారీ అద్దెలు చెల్లించే కన్నా.. ఈ హాస్టల్స్ లో అయితే బస బాగుంటుందని భావన పలువురు ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. అమరావతిలో ఇళ్ల కోసం వెదుకులాట చేయాలనుకుంటున్న వారికి.. ఈ హాస్టల్ ఆఫర్ ఆకర్షిస్తోంది.