Begin typing your search above and press return to search.

ఈబేలో అమ్మిన చారిత్రక సాక్ష్యం

By:  Tupaki Desk   |   30 May 2016 7:21 AM GMT
ఈబేలో అమ్మిన చారిత్రక సాక్ష్యం
X
ఈకామర్స్ సైట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంట్లో మిగిలి పోయిన వస్తువుల్ని.. పాతవి.. పాడైపోయినవి అమ్మేయటం మామూలుగా మారింది. అలా అమ్మేసిన ఒక వస్తువు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించటమే కాదు.. ఇప్పుడో సంచలనంగా మారింది. ఒక చారిత్రక సాక్ష్యంగా భావించే అపురూప వస్తువును పాత సామాను కింద కేవలం రూ.930లకు ఈబేలో అమ్మేశారు. కానీ.. దాన్ని అమ్మిన తర్వాత కానీ దాని విలువ ఏంటో తెలుసుకున్న వారు షాక్ తినే పరిస్థితి.

చూసేందుకు పాత టైప్ రైటర్ గా కనిపించే ఈ యంత్రం సాదాసీదా టైప్ రైటర్ కానే కాదు. దాని వెనుక చరిత్ర చాలానే ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఆ టైప్ రైటర్ పంపించిన సందేశాలతో ఎంతో రక్తపాతం చోటు చేసుకుందని చెప్పాలి. ఇంతకీ ఆ టైప్ రైటర్ వాడింది ఎవరో కాదు.. ప్రపంచాన్ని వణికించిన మహా నియంత హిట్లర్. తన ఆర్మీ జనరల్స్ కు రహస్య సందేశాల్ని పంపేందుకు ఈ టైప్ రైటర్ యంత్రాన్ని వినియోగించేవాడు.

ఈ యంత్రం ప్రత్యేకత ఏమిటంటే.. జర్మన్ అక్షరాల్ని టైప్ చేస్తే.. రహస్య కోడ్ లాంగ్వేజ్ లోకి మారిపోయి.. ఎవరికి పంపాలో వారికి పంపిస్తుంది. ఈ అపురూప వస్తువును ఈబే తన సైట్ లో అమ్మకానికి పెట్టింది. దీని ధర రూ.930లుగా పెట్టింది. ఏదో పాత వస్తువ అని అనుకొని పెట్టగా.. బ్రిటన్ లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ కంప్యూటింగ్ కు చెందిన జాన్ అనే ఒక వలంటీర్ దీన్ని గుర్తించారు. ఈ అపురూపమైన వస్తువును మారు మాట్లాడకుండా కొనేసి తన సొంతం చేసుకున్నాడు. తాను సొంతం చేసుకున్న ఈ యంత్రం పని తీరును జూన్ 3న మ్యూజియంలో పరీక్షించనున్నట్లు చెబుతున్నారు. తుక్కు సామాను కింద అమ్మిన టైప్ రైటర్ వెనుక ఇంత చరిత్ర ఉందా? అని దీన్ని గతంలో చూసిన వాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారట.