Begin typing your search above and press return to search.

పెథాయ్ 'అల‌'జ‌డి....తుఫాను అస‌లు క‌థ ఇదే

By:  Tupaki Desk   |   17 Dec 2018 6:56 AM GMT
పెథాయ్ అల‌జ‌డి....తుఫాను అస‌లు క‌థ ఇదే
X
కోస్తా తీరప్రాంతంలో పెథాయ్ తుపాను ‘అల’జడి సృష్టిస్తోంది. గంటకు 28కిలోమీటర్ల వేగంతో మచిలీపట్నం - కాకినాడ వైపు దూసుకొస్తున్న తుపాను నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు 280కిలోమీటర్లు - కృష్ణా జిల్లా మచిలీపట్నానికి 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలపడి సోమవారం సాయంత్రానికి కాకినాడ - యానాం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి తూర్పు వాయువ్య దిశ నుంచి గంటకు 90 నుంచి 100 కిమీ వేగంతో ఉద్ధృతంగా గాలులు వీస్తాయని హెచ్చరించారు. రాష్ట్రంలోని కాకినాడ - భీమునిపట్నం పోర్టుల్లో 7 నెంబర్ ప్రమాద హెచ్చరికను, విశాఖపట్నం, గంగవరంలో 6వ నెంబర్ ప్రమాద హెచ్చరికను - మచిలీపట్నం - నిజాంపట్నం పోర్టుల్లో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరికను - కృష్ణపట్నం - ఓడరేవు - కళింగపట్నం పోర్టుల్లో 3వ నెంబర్ హెచ్చరికను జారీ చేశారు. తుపాను తీరం దాటిన తరువాత కూడా గాలుల ఉద్ధృతి కొనసాగుతుందని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తుపాను కారణంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆదివారం సాయంత్రానికి వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈదురుగాలులు తోడవటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పెథాయ్ ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.

ఇదిలాఉండ‌గా, కోస్తాంధ్రా తీరాన్ని గడగడలాడిస్తున్న పెథాయ్ తుపాన్ ప్రభావం విమానాలు, రైళ్ల రాకపోకలపై పడింది. దీంతో విశాఖ ఎయిర్‌ పోర్ట్ - రైల్వే స్టేషన్ నుంచి వెళ్లాల్సిన విమానాలు - రైళ్లను అధికారులు రద్దు చేశారు. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దాదాపు 14 విమానాలు రద్దయ్యాయి. దీంతో విశాఖ ఎయిర్‌ పోర్ట్‌ లో 700 మంది ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ-విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది. చెన్నై-వైజాగ్ విమానం వైజాగ్‌ లో ల్యాండ్ అవలేక తిరిగి చెన్నై వెళ్లిపోయింది. హైదరాబాద్- వైజాగ్ స్పైస్ జెట్ విమానాన్ని కూడా అధికారులు రద్దు చేశారు. ఒకవైపు విమానాలు - మరోవైపు రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వైజాగ్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆహారం, తాగునీటిని రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.
కాగా, తుఫాన్‌ల‌కు పేర్లు పెట్ట‌డం వెనుక ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఉంది. అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్ల వచ్చే తుఫాన్‌లకు 1953 నుంచే పేర్లు పెడుతున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఈ పని చేస్తుంది. అయితే, దక్షిణాసియా - మధ్యప్రాచ్య ప్రాంతాల్లో తుఫాన్‌ లకు పేర్లు పెట్టే సంప్రదాయం 2004 నుంచి ప్రారంభమైంది. అంతకుముందు హిందూ. బంగాళాఖాతం - అరేబియా సముద్రంలో పుట్టిన ఎన్నో తుఫాన్లకు పేర్లు లేవు.

2004లో WMO ఆధ్వర్యంలో హిందూ - బంగాళాఖాతం - అరేబియా సముద్ర తీరాల పరిధిలోని దేశాలు సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో *భారత్ - పాకిస్తాన్ - బంగ్లాదేశ్ - మాల్దీవులు - మయన్మార్ - ఓమన్ - శ్రీలంక - థాయిలాండ్* పాల్గొని ఒక్కో దేశం 8 పేర్లను సూచించాయి. మొత్తం 8 దేశాలు తలో 8 పేర్లను సూచించడంతో మొత్తం 64 పేర్లతో జాబితాను రూపొందించారు.ఇంగ్లీష్ అక్షరమాల ప్రకారం లిస్టులో *బంగ్లాదేశ్* సూచించిన పేరు మొదటి స్థానంలో ఉంది. దాంతో 2004 అక్టోబరులో హిందూ మహాసముద్రంలో వచ్చిన తుఫాన్‌కు బంగ్లాదేశ్ సూచించిన *ఒనిల్* పేరు పెట్టారు. అదే ఏడాది అరేబియా సముద్రంలో వచ్చిన తుఫాన్‌కు *భారత్* సూచించిన *అగ్ని* పేరు పెట్టారు. ఇక ఏపీని అతలాకుతలం చేసిన *హుద్ హుద్* తుఫాన్‌కు..ఆ పేరును *పాకిస్తాన్* పెట్టింది. మొన్న వచ్చిన *తిత్లీకి సైతం పాకిస్తానే నామకరణం చేసింది*. ఐతే 8 దేశాలు సూచించిన 64 పేర్ల జాబితాలో ఇప్పటి వరకు 56 పేర్లను వాడేశారు. *పెథాయ్ తుఫాన్ 56వ స్థానంలో* ఉంది. మరో 8 తుఫాన్‌లు వస్తే ఆ జాబితాలోని పేర్లన్నీ పూర్తవుతాయి. అనంతరం మరోసారి సమావేశమై కొత్త లిస్టును రూపొందించే అవకాశముంది.
*తుఫాన్ పేర్ల వివరాలు*

*బంగ్లాదేశ్*
ఒనిల్, ఒగ్ని, నిషా, గిరి, హెలెన్, చపల ,ఓక్కీ ,ఫని

*ఇండియా*
అగ్ని, ఆకాశ్, బిజిలీ, జల్ ,లెహర్ ,మేఘ్ ,సాగర్ ,

వాయు
*మాల్దీవులు*

హిబరు ,గోను, ఆలియా, కీలా ,మాది ,రోను ,మకును ,హిక్కా

*మయన్మార్*
ప్యార్ ,యెమిన్ ,ప్యాన్ ,థానె ,నానోక్ ,కయాంత్ ,దయే ,కయాబ్

*ఒమన్*
బాజ్ ,సిదర్ ,వార్డ్, ముర్జాన్,నాడా ,లుబాన్ ,మహా

*పాకిస్తాన్*
ఫనూస్ నర్గీస్, లైలా, నీలం ,నీలోఫర్ వార్దా, *తిత్లీ*,బుల్‌బుల్, *హుద్ హుద్*

*శ్రీలంక*
మాలా ,రష్మి ,బంధు ,మహాసేన్, ప్రియా ,అసిరి, *గజ* సోబా

*థాయ్‌ల్యాండ్*
ముక్దా, ఖైముక్ ,ఫేట్ ,ఫైలిన్ ,కోమెన్ ,మోరా *పెథాయ్* ఆంఫాన్.