మంత్రి తలను నరికితెస్తే...రూ.కోటి ఇస్తాం

Thu Dec 06 2018 15:46:16 GMT+0530 (IST)

ఐదు రాష్ర్టాల ఎన్నికల పర్వంలో మూడు రాష్ర్టాల్లో పోలింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. మరో రెండు రాష్ర్టాలైన తెలంగాణ - రాజస్థాన్‌లో డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ రెండు రాష్ర్టాల్లో ఎన్నికల ప్రచారం బుధవారంతో ముగుస్తోంది. అయితే పోలింగ్ సందర్భంగా నేతలు చేసిన ప్రకటనలతో ఇంకా రచ్చ కొనసాగుతోంది. భారత మాజీ క్రికెటర్ - పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా దానికి కొనసాగింపు గా మరో వర్గం కలకలం రేపే కామెట్లు చేసింది.వివరాల్లోకి వెళితే ఎన్నికలు జరుగుతున్న రాజస్ధాన్ లో ప్రచారానికి నవజ్యోత్ సింగ్ సిద్దూ వెళ్లారు. గత ఆదివారం రామ్‌గంజ్ మండీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో సిద్దూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. దేశంలో బీజేపీ పార్టీ ప్రజల నమ్మకాన్ని కొల్పొయిందని చౌకీదారు కుక్క కూడా విశ్వాసం కోల్పోయిందని వ్యాఖ్యానించారు. మోడీ ఓ దొంగ.. యోగీ.. ఓ బోగీ అని అన్నారు. ఈ వ్యాఖ్యల పై యూపీ సీఎం ఆదిత్యానాధ్ స్ధాపించిన హిందూ యువ వాహిని ఆధ్వర్యంలో సిద్దూకి వ్యతిరేకంగా నిరసనలు ధర్నాలు నిర్వహిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ సీఎం పై నవజ్యోత్ సింగ్ సిద్దూ చేసిన వ్యాఖ్యాల పై హిందూ యువవాహిని ఆగ్రా విభాగం అధ్యక్షుడు తరుణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆందోళనలో పాల్గొన్న తరుణ్ సింగ్ కార్యకర్తల తో కలిసి సిద్దూకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిసారి పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడే సిద్దూ.. ఈదేశంలో ఉండేందుకు వీలు లేదని ఆయనను తామే స్వయంగా పాకిస్థాన్‌కు పంపిస్తామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యానాత్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సిద్దూ తలను నరికి తీసుకువస్తే..రూ. కోటి నజరానా అందిస్తామని ప్రకటించారు ఆయన ఆగ్రాలో పర్యటిస్తే నరికేస్తామని తరుణ్ సింగ్  హెచ్చరించారు. కాగా రాజస్థాన్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో బీజేపీ పార్టీపై సిద్దూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం...దానికి హిందూ యువవాహిని సంచలన ప్రకటన చేయడం కలకలంగా మారింది.