Begin typing your search above and press return to search.

పాక్‌ లో హిందువులకు గ్రేట్ న్యూస్‌

By:  Tupaki Desk   |   12 Feb 2016 6:48 AM GMT
పాక్‌ లో హిందువులకు గ్రేట్ న్యూస్‌
X
పాకిస్తాన్ దేశం గురించి, అక్క‌డ ఉండే ప్ర‌జ‌లు, పాల‌కుల ఆలోచ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. భార‌త‌దేశం అంటే పాకిస్తాన్ ముష్క‌రులు చూపే శ‌త్రుత్వాన్ని గురించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుసు. ఇక ఆ దేశంలోని హిందువుల గురించి, వాళ్ల‌కున్న హ‌క్కుల గురించి ఆలోచించ‌డ‌మే వింత అనుకుంటారు. కానీ దశాబ్దాల జాప్యం, ప‌ట్టింపులేని త‌నం చవిచూసిన పాకిస్తాన్‌ లోని హిందు మైనారిటీ సమాజం త్వరలో గుడ్ న్యూస్ విననుంది. ఆ దేశంలో హిందూ వివాహ చట్టం అందుబాటులోకి రానుంది.

పాకిస్తాన్ న్యాయశాఖకు చెందిన నేషనల్ అసెంబ్లీ స్థాయీ సంఘం హిందు వివాహ బిల్లు 2015 తుది ముసాయిదాను ఆమోదించింది. ఇందుకోసం జరిగిన సమావేశానికి ఐదుగురు హిందు శాసనకర్తలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్ర‌తిపాదిన బిల్లుపై సుదీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం రెండు సవరణలు చేసిన తరువాత బిల్లును ఏకగ్రీవంగా ఈ క‌మిటీ ఆమోదించింది. పురుషులు - మహిళల వివాహానికి కనీస వయస్సును 18గా నిర్ధారించడానికి, ఈ చట్టాన్ని దేశం అంతటికీ వర్తింపచేయడానికి సంబంధించినవి ఆ సవరణలు చేసారు.

ఏకగ్రీవంగా ఆమోదం పొందిన హిందు వివాహ బిల్లును త్వ‌ర‌లో నేషనల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పిఎంఎల్-ఎన్) బిల్లును సమర్థిస్తున్నందున ఇది సభలో ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హిందు సమాజం కోసం కుటుంబ చట్టం రూపకల్పనలో సుదీర్ఘంగా జాప్యం జరగడం పట్ల కమిటీ చైర్మన్ చౌధురి మహమూద్ బషీర్ విర్క్ విచారం వ్యక్తం చేశారు. మొత్తంగా పాక్ కూడా ప్ర‌పంచం తాము కూడా భాగ‌మే అని నిరూపించుకునే ముందడుగు వేస్తోంద‌న్న మాట‌. సంతోష‌మే క‌దా!!