Begin typing your search above and press return to search.

వినాయకుడి గుడిలో ముస్లిం మహిళ ప్రసవం

By:  Tupaki Desk   |   5 Oct 2015 11:10 AM GMT
వినాయకుడి గుడిలో ముస్లిం మహిళ ప్రసవం
X
భారతదేశంలో మత కల్లోల కంటే మానవత్వమే ఎక్కువగా ఉందని మరోమారు రుజువైంది. మానవత్వాన్ని మించిన మతం లేదని చాటిన ఈ ఘటన ముంబయిలో జరిగింది. నడివీధిలో పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ ముస్లిం మహిళను పక్కనే ఉన్న గుడి ఆవరణలోకి తీసుకెళ్లి పురుడు పోశారు కొందరు హిందూ మహిళలు.

ముంబయికి చెందిన ఇల్యాజ్ షేక్ తన భార్య నూర్జహాన్‌ ను ఆస్పత్రికి తీసుకెళుతున్నాడు. ఇంతలోనే ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. అయితే... తన వాహనంలో కాన్పు జరగడానికి వీల్లేదంటూ ట్యాక్సీ డ్రైవర్ ఆ దంపతులను రోడ్డు పైనే దించేశాడు. రోడ్డు మీద నొప్పులతో అవస్థపడుతున్న నూర్జహాన్‌ ను పక్కనే ఉన్న వినాయకుడి గుడిలో ఉన్న ఆడవాళ్లు చూశారు. వెంటనే వారు నూర్జహాన్ ను గుడి ప్రాంగణంలోకి తీసుకెళ్లి... చుట్టూ చీరలు దుప్పట్లు కట్టి కాన్పు చేశారు. దీంతో నూర్జహాన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా, వినాయకుడి సమక్షంలో బిడ్డకు జన్మనివ్వడం కంటే అదృష్టం ఏముందంటూ నూర్జహాన్ తన బిడ్డకు గణేష్ అని పేరు పెడుతున్నట్లు చెప్పింది. ఆ తర్వాత తల్లీ, బిడ్డలను ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

రోడ్డు మీద దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను అక్కడున్న మహిళలు ఆదుకున్నారని.... ఆలయంలోకి తీసుకెళ్లి తన భార్యకు కాన్పు చేసిన వారి రుణం తీర్చుకోలేనిదని ఇల్యాజ్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలాంటి గొప్ప సంఘటనలు భారత్ లో తప్ప ఇంకెక్కడా సాధ్యం కాదేమో.