Begin typing your search above and press return to search.

డాక్టర్ల కాల్పుల కేసు; ఎవరీ ప్రియాంక..?

By:  Tupaki Desk   |   12 Feb 2016 4:26 PM GMT
డాక్టర్ల కాల్పుల కేసు; ఎవరీ ప్రియాంక..?
X
తీవ్ర సంచలనం సృష్టించిన డాక్టర్ల కాల్పుల కేసుకు సంబంధించి తాజాగా పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. డాక్టర్ల కాల్పులు చోటు చేసుకోవటం.. అనంతరం డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య చేసుకోవటం లాంటి ఉదంతాలు జరిగిపోయాయి. ఈ కేసు సంబంధించి ఇప్పటికే బయటకు వచ్చిన అంశాలకు తోడు.. కేసుల చిక్కుముడి విడదీసే ప్రయత్నం చేస్తున్న పోలీసులకు సరికొత్త విషయాలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకూ చంద్రకళ అనే మహిళ పేరు రాగా.. తాజాగా ప్రియాంక అనే మరో పేరు వచ్చింది. దీనికి తోడు.. దిల్ సుఖ్ నగర్ లోని సిగ్మా ఆసుపత్రికి సంబంధించిన వివాదం కూడా తెరపైకి వచ్చింది.

ఈ కేసులో తాజా అప్ డేట్స్ చూస్తే..

1. ఈ కాల్పుల ఘటనలో డాక్టర్ ఉదయ్ పై డాక్టర్ శశికుమార్ కాల్పులు జరపటం.. అనంతరం శశికుమార్ సూసైడ్ చేసుకోగా.. గాయాలు అయిన ఉదయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక.. డాక్టర్ ఉదయ్ కుమార్ తరఫున ప్రియాంక అనే మహిళ భారీగా అప్పులు చేసుకున్న విషయం బయటకు వచ్చింది. ఇంతకీ.. ప్రియాంక ఎవరు? ఆమెకు.. డాక్టర్ ఉదయ్ కి మధ్య బంధం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

2. తన భర్తకు చెందిన కారు.. బ్రీఫ్ కేస్ మిస్ అయ్యిందంటూ సూసైడ్ చేసుకున్న డాక్టర్ శశికుమార్ సతీమణి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పోలీసులు అధికారులు కారును హిమాయత్ నగర్ లోని మినర్వా కాఫీషాప్ వద్ద డాక్టర్ శశి కారును గుర్తించారు. ఇక.. బ్రీఫ్ కేసుతో పాటు.. చెక్కు పుస్తకాలు తదితర సామాగ్రిని సొంతం చేసుకున్నారు. అంతేకాదు.. బ్రీఫ్ కేసులో లభించిన 14 తూటాలతో పాటు.. రివాల్వర్ లైసెన్స్ ను సీజ్ చేశారు.

3. డాక్టర్ల మధ్య చోటు చేసుకున్న కాల్పుల ఉదంతంతో మాదాపూర్ లోని లారెల్ ఆసుపత్రికి అప్పులు ఇచ్చిన పలువురు ఫైనాన్షియర్స్ క్యూ కడుతున్నారు. ఆసుపత్రిలో తాము పెట్టుబడి పెట్టామని.. తమకు వాటా ఇస్తామని చెప్పారని.. ఉదయ్ కుమార్ ఫ్రెండ్ గా చెప్పిన ప్రియాంక అనే మహిళ తమ వద్ద భారీగా మొత్తాల్ని అప్పులుగా తీసుకున్నారని.. తమ సంగతి ఏమిటని ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.

4. అప్పులు ఇచ్చిన వారంతా ప్రియాంక పేరునుప్రస్తావించటం.. ఆమె ఇచ్చిన ఫోన్ నెంబరుకు పోలీసులు ట్రై చేస్తే.. స్విచ్ఛాప్ చేసి ఉన్నట్లుగా చెబుతున్నారు.

5. సూసైడ్ చేసుకున్న డాక్టర్ శశికుమార్ తన సూసైడ్ నోట్ లో పలు పేర్లను రాసుకొచ్చారు. ఈ పేర్ల మీద దృష్టి సారించిన పోలీసులు.. దిల్ సుఖ్ నగర్ లోని సిగ్మా ఆసుపత్రికి సంబందించిన మరో వివాదాన్ని గుర్తించారు. మూడు నెలల క్రితమే డాక్టర్ శశి ఈ ఆసుపత్రిని లీజుకు తీసుకున్న విషయాన్ని గుర్తించారు.

6. ఈ ఆసుపత్రికి మాజీ డైరెక్టర్ అయిన కృష్ణ కిషోర్ రెడ్డి అలియాస కేకే రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఈ పేరును కూడా డాక్టర్ శశికుమార్ తన సూసైడ్ నోట్ లో పేర్కొనటం గమనార్హం.

7. సిగ్మా ఆసుపత్రికి సంబంధించిన వివాదం చూస్తే.. ఈ ఆసుపత్రికి సీఈవోగా రామారావు అనే వ్యక్తి వ్యవమరిస్తుంటే.. ఆసుపత్రి భవన యజమానిగా చిన్నారెడ్డిని గుర్తించారు. ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి డాక్టర్ శశికుమార్ దగ్గర పీఏగా ఉండేవాడని గుర్తించిన పోలీసులు వీరందరినీ విచారిస్తున్నారు. ఈ ఆసుపత్రికి సంబంధించి డాక్టర్ శశికి.. రామారావు.. చిన్నారెడ్డి.. ఓబుల్ రెడ్డి ల మధ్య రూ.1.3కోట్ల వివాదం నడవటం గమనార్హం.

8. సూసైడ్ చేసుకున్న డాక్టర్ శశికుమార్ ను తానే ఫామ్ హౌస్ దగ్గర దింపి వచ్చినట్లుగా ఆయన స్నేహితురాలు చంద్రకళ వచ్చినట్లుగా పేర్కొనగా.. ఆమె వచ్చారా? అన్న విషయంపై ఫామ్ హౌస్ గ్రామస్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

9. ఇక.. ఫామ్ హౌస్ వాచ్ మెన్ శంకరయ్య మాట్లాడుతూ.. డాక్టర్ శశికుమార్.. చంద్రకళ మేడమ్ ఇద్దరూ కార్లో వచ్చారని.. డాక్టర్ గారి ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని.. రాత్రి ఇక్కడే ఉంటారని మేడమ్ చెప్పినట్లుగా పేర్కొన్నాడు. తనను వెళ్లి పడుకోవాలని డాక్టర్ శశికుమార్ చెప్పారని.. తాను వెళ్లి గేటు దగ్గరున్న గదిలో పడుకున్నట్లు చెప్పిన శంకరయ్య.. తాను గన్ కాల్చిన చప్పుడేమీ వినిపించలేదని పేర్కొనటం గమనార్హం. అంతేకాదు.. డాక్టర్ శశికుమార్ ను చంద్రకళ మేడమ్ మొదటిసారే తీసుకొచ్చారని వాచ్ మెన్ చెప్పటం విశేషం.