Begin typing your search above and press return to search.

మ‌న‌మ్మాయికి అంత‌ర్జాతీయ గుర్తింపు

By:  Tupaki Desk   |   16 Jan 2018 4:28 AM GMT
మ‌న‌మ్మాయికి అంత‌ర్జాతీయ గుర్తింపు
X
సాదాసీదా అమ్మాయే. కానీ.. వృత్తి ప‌ట్ల ఆమె ప్ర‌ద‌ర్శించిన క‌మిట్‌మెంట్ ఆమెకు అంత‌ర్జాతీయంగా గుర్తింపు తెచ్చేలా చేసింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుద‌ల చేసిన క్యాలెండ‌ర్లో మ‌నమ్మాయి ఫోటో ఉండ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది అంత పెద్దసంస్థ క్యాలెండ‌ర్లో మ‌న‌మ్మాయి ఫోటోను ఎందుకు వేశారు? ఇంత‌కీ ఆమేం చేశార‌న్న‌ది చూస్తే..

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు చెందిన గీతావ‌ర్మ సాధార‌ణ మ‌హిళ‌. ఆమె సొంతూరు స‌ప్నాట్ అనే కుగ్రామం. స‌రైన ర‌వాణా సౌక‌ర్యాలు.. మౌలిక వ‌స‌తులు అన్న‌వి లేని ప్రాంతం. అలాంటి చోట ఆమె హెల్త్ వ‌ర్క‌ర్ గా ప‌ని చేస్తున్నారు. వాతావ‌ర‌ణ ప్ర‌తికూల‌తో నిండి ఉండే ప్రాంతంలో ప‌ని చేస్తున్నా.. ఆమె ఎవ‌రూ ఊహించ‌ని రికార్డును సొంతం చేసుకున్నారు.

అదేమంటే.. ఆమె విధులు నిర్వ‌ర్తించాల్సిన స‌ప్నాట్‌.. మండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల‌కు త‌ట్టు.. రూబెల్లా టీకాను వంద‌శాతం అందేలా చేశారు. మౌలిక స‌దుపాయాలు పెద్ద‌గా లేని చోట ఈ ల‌క్ష్యాన్ని సాధించ‌టం అంత తేలికైన విష‌యం కాదు. త‌న‌కు అప్ప‌గించిన ప‌నిని పూర్తి చేసేందుకు ఆమె ఎంత క‌ష్ట‌ప‌డ్డారో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

కొండ ప్రాంతాల్లో టీకాలు వేయ‌టానికి ఆమె కిలోమీట‌ర్ల కొద్దీ న‌డిచేందుకు వెనుకాడేవారు కాదు. రోడ్డు ఉన్న చోట బైకు వెనుక ప్ర‌త్యేకంగా బాక్స్ ను ఏర్పాటు చేసుకొని వెళ్లేవారు. క‌ఠిన ప‌రిస్థితుల్ని ప‌ట్టించుకోకుండా.. త‌న చుట్టూ ఉండేవారు ఆరోగ్యంగా ఉండాల‌న్న స‌దాశ‌యంతో ప‌ని చేసే ఆమెను ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా గుర్తించింది. తాజాగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌) కూడా గుర్తించి గీతావ‌ర్మ ఫోటోను 2018లో విడుద‌ల చేసిన క్యాలెండ‌ర్లో ప్ర‌చురించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా స్ఫూర్తినిచ్చే వారితో ప్ర‌చురించే క్యాలెండ‌ర్లో మ‌న‌మ్మాయ్ ఫోటో ప‌బ్లిష్ కావ‌టానికి మించిన ఆనందం ఇంకేం ఉంటుంది?