Begin typing your search above and press return to search.

ట్రంప్ చేతికి అణుబాంబు స్విచ్ ఇస్తారా?

By:  Tupaki Desk   |   30 July 2016 4:35 AM GMT
ట్రంప్ చేతికి అణుబాంబు స్విచ్ ఇస్తారా?
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. రెండు పార్టీలకు చెందిన అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో.. ఇరు పక్షాల నేతలు తమ నోటికి పని చెబుతున్నారు. దూకుడు వ్యాఖ్యలతో మండిపడే ట్రంప్ పై డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తాజాగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో అన్ని జాతులు కలిసి పని చేయాలా? వద్దా? అన్న విషయాన్ని తేల్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన హిల్లరీ.. ట్రంప్ తీరును బలంగా తప్పు పట్టారు.

స్థిరమైన ఆలోచనలు లేకుండా కోపిష్టిగా ఉండే ట్రంప్ లాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి చేతికి అణుబాంబు మీటను అప్పగించలేమన్నారు. ఒక్క ట్వీట్ కే భగ్గుమనే వ్యక్తిని నమ్మి అణ్వాయుధ మీటను ఎలా అప్పజెబుతామంటూ ఫైర్ అయిన హిల్లరీ..బలమైన శక్తులు మనల్ని కుప్పకూల్చేందుకు చూస్తున్నాయని.. విశ్వాసం.. పరస్పర గౌరవం అంతరించిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

కలిసి పని చేయటం..కలిసి ఎదగటం అవసరమా? కాదా? అన్న విషయాన్ని తేల్చుకోవాలన్న హిల్లరీ.. ‘‘కొద్దిమందికి కాకుండా అందరికి ఉద్యోగాలిచ్చే ఆర్థిక వ్యవస్థను.. విద్వేషాన్ని ప్రేమ జయించే దేశాన్ని నిర్మిస్తా. ట్రంప్ కార్మికుల శ్రమను పీల్చి సంపన్నుడైన చిన్నస్థాయి మనిషి. ఐఎస్ గురించి జనరల్స్ కంటే తనకే ఎక్కువ తెలుసని చెప్పటం సరికాదు. ట్రంప్ సమాజాన్ని చీల్చాలనుకుంటున్నారు. అది ఎప్పటికి నెరవేరదు. విద్వేష ప్రచారం.. ఉత్త మాటలు కట్టి పెట్టాలి. ఆయన అమెరికాను మిగితా ప్రపంచం నుంచి దూరం చేయాలని అనుకుంటున్నారు. దేశం క్షేమంగా ఉండాలని అనుకునే ప్రజలు తుపాకి లాబీ జేబులో ఉండేఅధ్యక్షుడ్ని కోరుకోరు’’ అంటూ ట్రంప్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన ప్రత్యర్థిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న హిల్లరీపై ట్రంప్ నోరు విప్పటం ఖాయంగా కనిపిస్తుంది. ఆ మాటలు ఎన్ని సంచలనాలు సృష్టిస్తాయో..?