Begin typing your search above and press return to search.

ట్రంప్ సంగ‌తి తేల్చేస్తాన‌న్న హిల్లరీ

By:  Tupaki Desk   |   27 Sep 2016 5:04 AM GMT
ట్రంప్ సంగ‌తి తేల్చేస్తాన‌న్న హిల్లరీ
X
తాను అధ్యక్ష పదవికి సిద్ధమయ్యాన‌ని.. అందుకే డిబెట్ కు సిద్ధమయ్యానని డెమోక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థి హిల్లరీ క్లింటన్ తేల్చిచెప్పారు. అమెరికా అధ్య‌క్ష‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యూయార్క్‌ లోని హోఫ్‌ స్ట్రా యూనివర్సిటీ హాల్‌ లో హిల్లరీ-డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్ జరిగింది. ఈ డిబేట్ లో హిల్లరీ మాట్లాడుతూ.. డోనాల్డ్ ట్రంప్ కు కౌంటర్ ఇచ్చారు. ట్రంప్‌ రాజకీయ జీవితం జాత్యాంహంకారంతోనే మొదలైందని విమ‌ర్శించారు. కార్పొరేట్‌ లొసుగుల వల్ల లాభపడింది ట్రంప్‌ కుటుంబమమేనని హిల్లరీ క్లింటన్‌ ఆరోపించారు. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌ కార్పొరేట్‌ లొసుగులు తొలగిస్తామని హిల్లరీ క్లింటన్‌ హామీనిచ్చారు. సంపన్నులకు పన్నుల మినహాయింపు ఇవ్వబోమని ఆమె స్పష్టం చేశారు. సామాన్యులు - మధ్య తరగతి వారికి లబ్ధి చేకూరుస్తామని తెలిపారు.

స‌మాజ పురోభివృద్ధిలో భాగంగా ఉద్యోగాల కల్పనకు ఎన్నో మార్గాలున్నాయని హిల్ల‌రి క్లింట‌న్‌ తెలిపారు. నిర్మాణ రంగం - మధ్య తరగతిపై ఖర్చు పెరగాలన్నారు. సోలార్‌ రంగంలో కొత్త ఉద్యోగాలను సృష్టించొచ్చని హిల్ల‌రి తెలిపారు. టెక్నాలజీ - ఇన్నోవేషన్‌ రంగాల్లో ఉద్యోగాలు కల్పించవచ్చని దాని వల్ల ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని ఆమె వివరించారు. ఆఫ్రో అమెరికన్స్‌ మనలో భాగమేనని - దేశంలో ప్రతి ఒక్కరినీ గౌరవించాల్సిందేన‌ని హిల్లరీ క్లింటన్‌ పేర్కొన్నారు. అమెరికా చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని గుర్తు చేశారు. సైబర్‌ సెక్యూరిటీ చాలా పెద్ద సవాల్‌ అని, రష్యా మన దేశంలో చాలా సంస్థలపై సైబర్‌ దాడులు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ - ప్రైవేటు ఫైళ్లను హ్యాక్‌ చేస్తున్నారని చెప్పారు. వీటిని ఎదుర్కొనే సత్తా అమెరికాకు ఉందని పేర్కొన్నారు. ట్రంప్‌ విధానాలు హ్యాకింగ్‌ ను ప్రోత్సహిస్తున్నట్లుందని ఆరోపించారు. కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ గా ట్రంప్‌ పనికిరారని విమర్శించారు. గన్‌ కల్చర్‌ వల్ల సమస్యలు వస్తున్నాయని తెలిపారు.

అనంత‌రం డోనాల్డ్‌ ట్రంప్ ప్ర‌సంగిస్తూ తాను డిబేట్‌ కోసం సిద్ధం కాలేదని - అధ్యక్ష పదవికి సిద్ధమయ్యానని పేర్కొన్నారు. తాను ఎలాంటి జాత్యాహంకారం చూపలేదని హిల్ల‌రీ పార్టీ నేత‌లే ఐసిస్‌ మీద పోరాటం చేయలేకపోయారని దుయ్యబట్టారు. ఐసిస్‌ ఎదుగుదలకు ఓ రకంగా ఒబామా - హిల్లరీలే కారణమని ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిల్లరీవి వట్టి మాటలేనని, 30 ఏళ్లుగా ఈ మాటలు వింటూనే ఉన్నామని విమర్శించారు. హిల్లరీ 30వేల ఈమెయిల్స్‌ డిలీట్‌ చేశారని ట్రంప్‌ ఆరోపించారు. చైనా - మెక్సికో - ఇండియా వంటి దేశాలు ఉద్యోగాలు కొల్లగొడుతున్నాయని డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. త‌రలిపోతున్న ఉద్యోగాలను తాను వెనక్కి తీసుకురాగలనని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు పరిష్కారాల గురించి హిల్లరీ మాట్లాడటం విడ్డూరమని - 30 ఏళ్ల నుంచి హిల్లరీ ఎందుకు పట్టించుకోలేదని డోనాల్డ్‌ ట్రంప్ ప్రశ్నించారు. ఒబామా అధ్యక్షుడయ్యాక నాలుగువేల మందిని చంపేశారని ట్రంప్‌ ఆరోపించారు. హిల్లరీ ట్యాక్స్‌ విధానాలు దేశానికి నష్టం కలిగిస్తాయని విమర్శించారు. తాను పన్నులను తగ్గిస్తానని హామీనిచ్చారు. తన ట్యాక్స్‌ వివరాలను బయటపెడతానని ట్రంప్‌ స్పష్టం చేశారు. హిల్లరీ తన సీక్రెట్‌ మెయిల్స్‌ బయట పెట్టగలరా అని ప్రశ్నించారు. త‌న సంస్థ‌ల ద్వారా వందలు - వేల ఉద్యోగాలను తాను సృష్టించానని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/