మొన్న అబ్బాయ్..నిన్న అమ్మాయ్..ఇప్పుడు హిజ్రా

Sun Feb 18 2018 11:03:41 GMT+0530 (IST)

వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ మహానగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుంటారు పోలీసులు. అయితే.. ఈ డ్రైవ్ లో భాగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ మధ్యన సంచలనంగా మారాయి. అంతేకాదు.. పోలీసులకు మహా గొప్ప తలనొప్పిగా ఉంటున్నాయి. డ్రైవ్ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.మొన్నామధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా పూటుగా తాగిన ఒక యువకుడ్ని పోలీసులు పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తే.. పోలీసులపై చెలరేగిపోయాడు.

విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిపై రెచ్చిపోయాడు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కావటం.. పలుకుబడి ఉండటంతో పోలీసులు కాస్త వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. ఈ అనుభవం పోలీసు వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం చేసేలా చేసిందని చెబుతున్నారు. ఈ ఘటనను మర్చిపోక ముందే.. ఆ మధ్యన ఒక మహిళ ఫుల్ గా తాగేసి డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా బుక్ అయ్యింది.

చుట్టూ మీడియావాళ్లు ఉన్నా పట్టించుకోని ఆమె.. తనను ఆపిన పోలీసులపై ఫైర్ అయ్యింది. ఒక పోలీసుపై దాడి యత్నం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ.. ఆమెను ఏమీ అనకుండా సర్దిచెప్పి పంపించేశారు. అధికారులపై దురుసుగా వ్యవహరించిన వైనంపై కేసు నమోదు చేయలేదని చెబుతారు.
 
తాజాగా శనివారం రాత్రి జూబ్లీహిల్స్ లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక హిజ్రా మద్యం మత్తులో హల్ చల్ చేసింది. ఈసారి పోలీసుల మీద కాకుండా వారితో ఉన్న మీడియాపై దాడికి యత్నించిన వైనం సంచలనంగా మారింది. ఎప్పటిలానే ఫుల్ గా తాగేసి వాహనాలు నడుపుతున్న 43 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 23 కార్లు.. 20 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. పోలీస్ అన్న స్టిక్కర్ వేసుకొని కారులో పోలీస్ లాఠీతో తిరుగుతున్న యువకుడ్ని పోలీసులు గుర్తించి.. వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ సంగతేమో కానీ.. తాగేసి దురుసుగా వ్యవహరించే ఉదంతాలతో అటు పోలీసులు.. ఇటు మీడియా సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.