Begin typing your search above and press return to search.

టీడీపీ విలీనంపై హైకోర్టులో సూప‌ర్ ఫైట్‌

By:  Tupaki Desk   |   24 Aug 2016 9:17 AM GMT
టీడీపీ విలీనంపై హైకోర్టులో సూప‌ర్ ఫైట్‌
X
తెలంగాణ‌లో విప‌క్ష పార్టీగా ఉన్న టీడీపీకి అప్ప‌ట్లో ఈ రాష్ట్ర సీఎం కేసీఆర్ చుక్క‌లు చూపించారు. అసెంబ్లీలో టీఆర్ ఎస్ పార్టీ బ‌లంగానే ఉన్నా త‌న‌ రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్థుల‌ను వీక్ చేయాల‌ని కేసీఆర్‌ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు తెర‌తీశారు. దీంతో చీమ‌ల దండు మాదిరిగా వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు క్యూక‌ట్టి మ‌రీ కారెక్కేశారు. ఆశ్చ‌ర్యం ఏంటంటే.. పార్టీలో అంత‌ర్గ‌త‌ క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పెద్ద పీట వేసే సీపీఐకి చెందిన ఎమ్మెల్యే కూడా ఈ దండులో చేరి కేసీఆర్‌ కు జైకొట్టేశారు. త‌న రాజ‌కీయ శత్రువు చంద్ర‌బాబు టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేల‌ను కూడా కేసీఆర్ కారెక్కించేసుకుని వారికి మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చారు.

అయితే, దీనిపై ఎప్ప‌టి క‌ప్పుడు స్పందిస్తూ వ‌చ్చిన టీడీపీ ఫైర్ బ్రాండ్ - కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. జంప్ జిలానీల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారికి నోటీసులు ఇచ్చారు. అయితే, ఆయ‌న త‌న విచ‌క్ష‌ణాధికారం వినియోగించి వాటిని ప‌క్క‌న ప‌డేస్తూ వ‌చ్చారు. ఇక‌, ఆ త‌ర్వాత టీడీపీ స‌భా ప‌క్ష‌నేత‌గా ఉన్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌ రావు సైతం బాబుకి బై చెప్పి కేసీఆర్ పంచ‌న చేరిపోయారు. త‌ర్వాత టీ టీడీపీ శాస‌న‌స‌భాప‌క్షం టీఆర్ ఎస్‌ లో విలీనం అయిపోయింది అంటూ స్పీక‌ర్ ఓ ప్ర‌క‌ట‌న జారీ చేశారు. అప్ప‌టికే త‌మ వాళ్ల‌ను కారెక్కించుకోవ‌డంపై మండిప‌డుతున్న టీడీపీ నేత‌లకు స్పీక‌ర్ ప్ర‌క‌ట‌న మ‌రింత మంట పుట్టించింది. దీంతో ఇక లాభం లేద‌ని విష‌యాన్ని హైకోర్టుకు తీసుకెళ్లారు.

తాము ఇచ్చిన ఫిరాయింపుల‌పై చ‌ర్య‌లు తీసుకోకుండా.. స్పీక‌ర్ త‌న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. టీడీపీ విలీన ప్ర‌క‌ట‌న చేశార‌నిదీనిని ర‌ద్దు చేయాల‌ని కోరుతూ రేవంత్ రెడ్డి స‌హా టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌లు హైకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిపై మంగ‌ళ‌వారం వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి.. భ‌లే ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. స్పీక‌ర్ త‌ర‌ఫున తెలంగాణ అటార్నీ జ‌న‌ర‌ల్ రామకృష్ణారెడ్డి వాదిస్తూ.. ఒకింత తీవ్ర‌స్థాయిలో టీడీపీపై విరుచుకుప‌డ్డారు. దీంతో న్యాయ‌మూర్తి ఎమ్.ఎస్.రామచంద్రరావు ఒకింత ఆగ్ర‌హానికి గురై.. స్పీడు త‌గ్గించాల‌ని - అదేస‌మ‌యంలో సౌండ్ కూడా త‌గ్గించాల‌ని సూచించ‌డం గ‌మ‌నార్హం. దీనికి మ‌రోసారి స్పందించిన ఏజీ త‌న వాద‌న‌ను అడ్డుకోజాల‌ర‌ని అన్నార‌ట‌.

అంతేకాకుండా తాను శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శి త‌ర‌ఫున వాదిస్తాన‌ని చెప్ప‌డం ఇక్క‌డ కీల‌కం. అస‌లు కేసు రేవంత్ రెడ్డి - మ‌ధుసూద‌నాచారిల గురించి ఉండ‌గా.. అసెంబ్లీ సెక్ర‌ట‌రీ ప్ర‌స్తావ‌వ వ‌చ్చింది. దీనిపైనా న్యాయ‌మూర్తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. మ‌ధ్య‌లో ఆయ‌నెందుకు అన్నార‌ని తెలిసింది. దీంతో ఒక్క‌సారిగా హైకొర్టులో వాతావ‌ర‌ణం మారిపోయింద‌ని స‌మాచారం. ఏదేమైనా న్యాయ‌మూర్తి ఈ కేసులో ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. గతంలో టీడీపీకి చెందిన స్విస్ ఛాలెంజ్ కేసును కూడా ఈయ‌నే విచారించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఎలాంటి తీర్పు వెలువ‌రుస్తారో అనేది ఇప్పుటు టీడీపీ త‌మ్ముళ్ల‌లో టెన్ష‌న్‌ కు గురిచేస్తోంద‌ట‌!