Begin typing your search above and press return to search.

ఫిరాయింపుల నిరోధానికి చట్టాలెందుకో?

By:  Tupaki Desk   |   17 April 2018 5:24 AM GMT
ఫిరాయింపుల నిరోధానికి చట్టాలెందుకో?
X
తెలుగు నేల‌కు చెందిన రెండు రాష్ట్రాల్లో గ‌డ‌చిన ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ ఫిరాయింపులు పెద్ద ఎత్తున జ‌రిగాయి. ముందుగా తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర తీయ‌గా... ఆ త‌ర్వాత ఏపీలోనూ టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు మ‌రింత జోరుగా పార్టీ ఫిరాయింపుల‌నున ప్రోత్స‌హించారు. ఆప‌రేష‌న్ ఆకర్ష్ పేరిట జ‌రిగిన ఈ ఫిరాయింపుల్లో ఇప్ప‌టిదాకా వైసీపీ టికెట్ల‌పై విజ‌యం సాధించిన 23 మంది ఎమ్మెల్యేలు - ముగ్గురు ఎంపీలు - ముగ్గురు ఎమ్మెల్సీల‌ను చంద్ర‌బాబు త‌న పార్టీలోకి లాగేశారు. వీరిలో ఓ న‌లుగురు ఎమ్మెల్యేల‌కు ఆయ‌న త‌న‌ర మంత్రివ‌ర్గంలో చోటు కూడా క‌ల్పించారు. ఓ పార్టీ టికెట్ పై విజ‌యం సాధించిన ప్ర‌జా ప్ర‌తినిధులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయ‌కుండానే మ‌రో పార్టీలోకి చేర‌డ‌మే త‌ప్పనుకుంటే... తాము ఓడించిన పార్టీకి చెందిన పార్టీ కేబినెట్ లో మంత్రులుగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డ‌మంటే... ఇంకెంత నేర‌మో ఇట్టే చెప్పేయొచ్చు. అయినా ఇలా ఓ పార్టీ నుంచి ప్ర‌జా ప్ర‌తినిధిగా గెలిచి... త‌న స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం స‌చ్ఛీల రాజ‌కీయాల‌కు తూట్టు పొడిచేలా ఇత‌ర పార్టీల్లోకి చేరే ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ముకుతాడు వేసేందుకు భార‌త రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టం పేరిట ప్ర‌త్యేక చ‌ట్టమే ఉంది. అయితే ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఈ చ‌ట్టాన్ని చ‌ట్టు బండ‌గా మార్చేశార‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఈ చ‌ట్టం ప్ర‌కారం పార్టీ మారిన ప్ర‌జా ప్ర‌తినిధి... గెలిచిన పార్టీకి ద్రోహం చేసి మ‌రో పార్టీలో చేరితే స‌ద‌రు ప్ర‌జా ప్ర‌తినిధి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చ‌ట్ట‌స‌భ‌కు సంబంధించి చైర్మ‌న్‌ - స్పీక‌ర్ చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంది. ప‌ద‌వికి రాజీనామా చేయ‌కుండా పార్టీ మారే ప్ర‌జా ప్ర‌తినిధి స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాలి. అయితే ఇప్పుడు అలా జ‌ర‌గ‌డం లేదు. త‌మ పార్టీ టికెట్‌ పై విజ‌యం సాధించి త‌మ ప్ర‌త్యర్థి పార్టీలో చేరిన ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలని, త‌క్ష‌ణ‌మే వారిని అన‌ర్హులుగా ప్ర‌క‌టించాల‌ని ఏపీ అసెంబ్లీలో ప్ర‌ధాన విప‌క్షంగా ఉన్న వైసీపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌లు... స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ కు ఇప్ప‌టికే ప‌లుమార్లు విజ్ఞ‌ప్తి చేశారు. అయితే ఈ ఫిర్యాదుల‌ను ప‌రిశీలిస్తున్నామంటూ చెబుతూ వ‌స్తున్న స్పీక‌ర్ కార్యాల‌యం ఇప్ప‌టిదాకా స‌ద‌రు జంపింగ్ ల‌పై చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లానే క‌నిపించ‌లేదు. ఈ క్ర‌మంలో పార్టీ మారిన స‌ద‌రు ఎమ్మెల్యేల‌ను అన‌ర్హులుగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ... తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి హైకోర్టులో ఓ ప్ర‌జాప్రయోజ‌న వ్యాజ్యం(పిల్) దాఖ‌లైంది.

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రులుగా - ఎమ్మెల్యేలుగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సతీష్‌ కుమార్‌ హైకోర్టులో ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. వైసీపీ ద్వారా గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ ను - ఫిరాయింపులను ప్రోత్సహిస్తునందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్ ను ఆదేశించాలంటూ దాఖలైన ఈ పిల్‌ 'విచారణార్హత'పై హైకోర్టు ప్రాథమికంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే వ్యవహారం స్పీకర్‌ ముందు పరిష్కారం కాకుండా... తామెలా విచారించగలమని హైకోర్టు ద‌ర్మాస‌నం పేర్కొంది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి వాదనలు వినేందుకు విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసింది.

ఈ నేప‌థ్యంలో పార్టీ ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టం అమ‌లుపై పెద్ద చ‌ర్చ‌కే తెర లేసింద‌ని చెప్పాలి. పార్టీలు మారిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన స్పీక‌ర్ అందుకు విరుద్ధంగా కాల‌యాప‌న చేస్తున్న తీరుగా వ్య‌వ‌హ‌రిస్తే... స్పీక‌ర్ స్పందించేలోగానే శాస‌న‌స‌భా కాలం ముగిసిపోతే... అప్పుడు ఏం చేయాలి? అస‌లు ఫిరాయింపుల‌ను నిరోధించేందుకు ఉద్దేశించిన ఈ చ‌ట్టాన్ని అమ‌లు చేసే విష‌యంలో స్పీక‌ర్ కు నిర్దేశిత స‌మయాన్ని కేటాయించ‌ని కార‌ణంగానే ఈ త‌ర‌హా జాప్యం జ‌రుగుతోంద‌న్న వాద‌న కూడా ఇప్పుడు కొత్త‌గా తెరపైకి వ‌చ్చింద‌నే చెప్పాలి. చ‌ట్టంలోని లొసుగుల‌ను ఆస‌రా చేసుకుని అధికారంలో ఉండే పార్టీ పిరాయింపుల నిరోధ‌క చ‌ట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నాయ‌న‌డానికి ఏపీలో జ‌రుగుతున్న తంతే నిద‌ర్శ‌న‌మ‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. మొత్తంగా చ‌ట్టాన్ని అమ‌లు చేయాల‌ని చ‌ట్ట‌స‌భ‌ల‌కు చెప్పే అధికారం కూడా కోర్టుల‌కు లేకుండా పోయింద‌న్న వాద‌న ఇప్పుడు కొత్త‌గా తెర‌పైకి వ‌చ్చింద‌నే చెప్పాలి. చూద్దాం... 25న జ‌రిగే విచార‌ణ‌లో కోర్టు ఎలా స్పందిస్తుందో?