Begin typing your search above and press return to search.

చెమ‌టోడ్చి మ‌రీ..ఆ ఎమ్మెల్యేల‌పై పైచేయి సాధించిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   21 Aug 2018 11:08 AM GMT
చెమ‌టోడ్చి మ‌రీ..ఆ ఎమ్మెల్యేల‌పై పైచేయి సాధించిన కేసీఆర్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌ను అనుకున్న‌ది `తాత్కాలికంగా` సాధించుకున్నారు. కాంగ్రెస్ నేత‌లైన మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి - సంపత్ కుమార్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు కేసులో తాజాగా ఆయ‌న‌దే పైచేయిగా నిలిచింది. కేసీఆర్ చెమ‌టోడ్చి మ‌రీ చేసిన కృషితో ఆ ఇద్ద‌రు నేత‌ల‌కు హైకోర్టులో చుక్కెదురైంది. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి - ఎమ్మెల్యే సంప‌త్‌ లు మైక్ హెడ్‌ ఫోన్‌ ను గవర్నర్‌ పైకి విసరగా అది గాంధీ ఫోటోకు తగిలి దాని కింద ఉన్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌ పై పడటం, దీంతో స్వామిగౌడ్‌ కు తీవ్రంగా గాయమ‌వ‌డం, ఆ ఇద్ద‌రిపై స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌డం తెలిసిన సంగ‌తే. దీన్ని వ్య‌తిరేకిస్తూ వారు న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌గా అన‌ర్హ‌త స‌రికాద‌ని సింగిల్ జ‌డ్జీ బెంచ్ తీర్పు ఇచ్చింది.

సింగిల్ జడ్జీ ఉత్తర్వులను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో అప్పీల్ చేసింది. ప్రభుత్వ అప్పీల్‌ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. కోమటిరెడ్డి - సంపత్‌ ను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలన్న సింగిల్ జడ్జీ ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. రెండు నెలల పాటు సింగిల్ జడ్జీ ఉత్తర్వులను నిలిపివేస్తూ ఇవాళ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ - న్యాయశాఖ కార్యదర్శులపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ ను రెండు నెలల పాటు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను 4 వారాల పాటు హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. రాష్ర్ట ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

కాగా, ఈ ఎపిసోడ్‌ ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కేసీఆర్ వారిపై అన‌ర్హ‌త వేటు కోసం ఢిల్లీ నుంచి మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని పిలిపించారు. స‌స్పెన్ష‌న్ కొన‌సాగించేలా ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా వాద‌న‌లు వినిపించారు. ఇటు అసెంబ్లీ త‌ర‌ఫున‌ కూడా త‌గు వివ‌రాలు అంద‌జేయించ‌డంతో ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు ప‌డింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తంగా కేసీఆర్ త‌న‌దైన శైలిలో ప‌ట్టుబ‌ట్టి ఈ మేర‌కు తీర్పు వ‌చ్చేలా ఎత్తుగ‌డ‌లు చెమ‌టోడ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.