Begin typing your search above and press return to search.

కోడిపందాలు..ఏపీ స‌ర్కారు త‌లంటిన హైకోర్టు

By:  Tupaki Desk   |   23 Jan 2018 12:14 PM GMT
కోడిపందాలు..ఏపీ స‌ర్కారు త‌లంటిన హైకోర్టు
X
కోడిపందాల్ని నిర్వహించకుండా అధికారులు అన్ని చర్యలూ తీసుకుంటారని హామీ ఇచ్చినా ఎందుకు అడ్డుకోలేకపోయిందని ఏపీ సర్కార్‌ను హైకోర్టు నిలదీసింది. కోర్టుకు హామీ ఇవ్వడమే కాకుండా కోడిపందాల్ని నిర్వహించడానికి వీల్లేదని తాము ఉత్తర్వులిచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ప్రశ్నించింది. కోడిపందాలపై కౌంటర్‌ పిటిషన్‌ వేయాలని ఈ నెల 4న ఆదేశాలిస్తే తీరా కేసు విచారణకు వచ్చినప్పుడు తమకు సమయం కావాలని సీఎస్‌ - డిజిపి తరఫు లాయర్లు కోరడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.

గత ఏడాది సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా - భీమవరం మండలం - వెంప - శ్రీరాంపురం గ్రామాలలో కోడి పందేల పేరుతో జూదం - అశ్లీల నృత్యాలు - వ్యభిచారం నిర్వహించారని - ఈ సంక్రాంతి సందర్భంగా ఇవేమీ జరగకుండా తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కలిదిండి రామ చంద్రరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచార‌ణ సంద‌ర్భంగా రాష్ట్ర స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాష్ట్రంలో కోడి పందేలు జరిగిన తీరును చూస్తుంటే మా ఆదేశాలను అధికారులు సీరియస్‌ గా తీసుకున్నట్లు కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోడి పందేలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదికలు ఇవ్వాలన్న తమ ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. అరుదుగా టీవీ చూసే తమకే కోడిపందేల నిర్వహణ దృశ్యాలు కనిపించాయని ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 29న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్ - డీజీపీ ఎం మాలకొండయ్య స్వయంగా తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ - జస్టిస్ ఎం గంగారావులతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.