Begin typing your search above and press return to search.

గుత్తాకు హైకోర్టు త‌లంటేసిందిగా!

By:  Tupaki Desk   |   12 Sep 2017 11:14 AM GMT
గుత్తాకు హైకోర్టు త‌లంటేసిందిగా!
X
గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి. తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క నేత‌. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌గా ఆయ‌న రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో చ‌క్రం తిప్పారు. అలాంటి నేత‌కు తాజాగా మంగ‌ళ‌వారం హైకోర్టు త‌లంటేసింది. కోర్టుల‌ను రాజ‌కీయ వేదిక‌లు చేస్తారా? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. కోర్టుల‌తో ఆడేసుకుంటారా? అని నిల‌దీసింది. దీంతో ఖంగుతిన్న గుత్తా త‌ర‌ఫు లాయ‌ర్ మౌనంగా నిల‌బ‌డిపోయారు. మ‌రి ఎందుకిలా జ‌రిగిందో చూద్దామా? కాంగ్రెస్‌ తో రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన గుత్తా.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన పరిణామాలు - సీఎం కేసీఆర్ ఆక‌ర్ష్ మంత్రంతో ఆ పార్టీలో చేరిపోయారు.

అలా కేసీఆర్ పంచ‌న అధికార పార్టీలో చేర‌క‌ముందు కాంగ్రెస్‌ లో ఉండ‌గా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఆయ‌న అధికార ప‌క్షం కేసీఆర్ పై రోజూ నిప్పులు చెరిగేవారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కేసీఆర్‌ ను మ‌రింత‌గా ఇరుకున పెట్టాల‌ని భావించారు. దీనికి అదేస‌మ‌యంలో కేసీఆర్ వివిధ పార్టీల నుంచి వ‌చ్చి త‌న పార్టీలో చేరిన సీనియ‌ర్ల‌కు ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల పోస్టులు క‌ట్ట‌బెట్టి - వారికి ల‌క్ష‌లకు ల‌క్ష‌లు జీతాలు ప్ర‌క‌టించి - వారికి కేబినెట్ హోదాను సైతం ఇవ్వ‌డం క‌లిసొచ్చింది. ఈ జాబితాలో.. కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన డీఎస్‌ - కేకే వంటి మేధావులు ఉండ‌డంతో గుత్తా మ‌రింత రెచ్చిపోయారు. కేసీఆర్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా హైకోర్టును ఆశ్ర‌యించారు.

ప్ర‌భుత్వం స‌ల‌హాదారుల‌కు కేబినెట్ హోదా క‌ల్పించ‌డంపై హైకోర్టులో పిల్ దాఖ‌లు చేశారు. ఇది అప్ప‌ట్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. ఇంత‌లో.. రోజులు గ‌డిచాయి. అటు వాళ్లు ఇటొచ్చారు. అన్న‌ట్టుగా గుత్తా కూడా కేసీఆర్ బ్యాచ్‌ లో చేరిపోయారు. దీంతో ఆయ‌న‌కు కేసీఆర్ ఏం చేసినా బాగుంద‌ని అనిపించింది. ఇదిలావుంటే, గ‌తంలో గుత్తా వేసిన‌ పిల్ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సంద‌ర్భంగా కోర్టు విచార‌ణ ప్రారంభించేందుకు రెడీ అయింది. అయితే, ఇంత‌లోనే గుత్తా త‌ర‌ఫు లాయ‌ర్ ఈ పిల్‌ ను వెన‌క్కి తీసుకుంటామ‌ని, త‌మ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కోర్టును కోరారు.

అంతే!! కోర్టు ఒక్క‌సారిగా అగ్గిమీద గుగ్గిలం అయింది. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించవద్దని వ్యాఖ్యానించింది. పిటిషన్ ఉపసంహ‌రణకు అనుమతి నిరాకరించింది. పిటిషనర్‌ వెనక్కి తగ్గినా తాము విచారణ కొనసాగిస్తామని పేర్కొంది. ఈ ప‌రిణామంతో గుత్తా న్యాయ‌వాది నిర్ఘాంత పోయారు. మ‌రి భ‌విష్య‌త్తులో కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.