Begin typing your search above and press return to search.

సెల్వంకు షాక్..అక్రమాస్తులపై కోర్టు సంచలనం

By:  Tupaki Desk   |   17 July 2018 5:53 PM GMT
సెల్వంకు షాక్..అక్రమాస్తులపై కోర్టు సంచలనం
X

తమిళనాడు డిప్యూటీ సీఎం పనీర్ సెల్వంకు మద్రాస్ హైకోర్ట్ షాక్ ఇచ్చింది.ముఖ్యమంత్రి - ఆర్థికమంత్రిగా పన్నీర్ సెల్వం పనిచేసిన కాలంలో చేసిన అవినీతి - అక్రమ సంపాదన విషయంలో సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది. పన్నీర్ సెల్వం - అతని బినామీలు - కుటుంబ సభ్యులు వివాదాస్పద ఆస్తులపై విచారణ చేపట్టాలని గతంలో డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ భారతి డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ కి ఫిర్యాదు చేశారు. మార్చ్ 10న డీవీఏకి ఫిర్యాదు అందజేస్తూ సెల్వం అధికార దుర్వినియోగంతో కోట్ల రూపాయలు కూడగట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఆదాయ మార్గాలను సైతం తెలియజేయాలని కోరారు. సంపాదించిన ఆస్థులను బినామీ పేర్లపై కంపెనీలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. డిప్యూటీ సీఎం తన ఎన్నికల అఫిడవిట్ లో - ఆదాయ పన్ను శాఖకు ఇచ్చిన సమాచారంలో తప్పుడు లెక్కలు నమోదు చేశారని డీఎంకే తెలిపింది. 2014-15 దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ఆయన ఆదాయాన్ని కేవలం రూ. 5.80 లక్షలుగా చూపారు. అయితే.. అదే సమయంలో రూ.17.85 లక్షలు ఖర్చుచేసి కారు కొన్నారని డీఎంకే తెలిపింది.

అయితే, డీవీఏసీ సెల్వం ఆస్తుల‌పై విచార‌ణ విష‌యంలో దూకుడుగా ముందుకు సాగ‌లేదు. దీంతో ఈ కేసు హైకోర్టు దృష్టికి వ‌చ్చింది. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన న్యాయ‌స్థానం సెల్వం వివాదాస్పద ఆస్తులపై దర్యాప్తు చేయలేదని సీబీఐని కోర్టు ప్రశ్నించింది. పన్నీర్ సెల్వం వివాదాస్పద ఆస్తులపై ఫిర్యాదు చేసి మూడు నెలలైనా.. ఎందుకు స్పందించలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 23 లోగా వివరణ ఇవ్వాలని ని జస్టిస్ జి.జయచంద్రన్ ఆదేశించారు.

ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం అనంత‌రం ప‌న్నీర్ సెల్వం - ప‌ళ‌నిస్వామి విడిపోవ‌డం - ఆ గ్రూపుల విలీనం ప్ర‌క్రియ‌లో కూడా పన్నీర్ సెల్వం అవినీతి చిట్టా తెర‌మీద‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇరు గ్రూపు విలీనం ఇక లేదని దాదాపు ఖాయమవడంతో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి జూలు విదిల్చారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అవినీతి చిట్టాను బయటకు తీయాలంటూ అధికారులను ఆదేశించారు. అలాగే క్వారీల వ్యవహారంలో కాంట్రాక్టర్ శేఖర్‌ రెడ్డితో ఉన్న సంబంధాలపైనా పళనిస్వామి దృష్టి సారించినట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ప‌ళ‌నిస్వామితో సెల్వం చేతులు క‌ల‌ప‌డంతో...ఈ ఆర్డ‌ర్ అట‌కెక్కింది. కాగా, తాజా ఉదంతంతో మ‌ళ్లీ ప‌న్నీర్ అక్ర‌మాస్తులు తెర‌మీద‌కు వ‌చ్చాయి.