ఏపీలో పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు 3 నెలల గడువు!

Tue Oct 23 2018 16:02:21 GMT+0530 (IST)

చంద్రబాబు సర్కారుకు ఉమ్మడి హైకోర్టులో షాక్ తగిలింది.నిత్యం నీతులు చెప్పేపెద్ద మనిషి.. తమ వరకూ వచ్చేసరికి మాత్రం జీవోలతో కాలం గడిపేస్తుంటారు. విపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల గురించి గళం విప్పే బాబు.. తాను అధికారంలోకి ఉన్న వేళలో మాత్రం సమయానికి స్థానిక ఎన్నికల్ని నిర్వహించేందుకు మాత్రం ససేమిరా అనేయటం మొదట్నించి ఉన్నదే. తాజాగా అలాంటి పనే చేసి.. పంచాయితీ ఎన్నికల్నిపక్కన పెట్టేసి స్పెషల్ ఆఫీసర్ల చేత పాలన సాగిస్తున్నారు.ఇందుకు చట్టపరమైన ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వీలుగా జీవో 90ను విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మూడు నెలల్లో పంచాయితీ ఎన్నికల్ని నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాదు.. గడువు ముగిసిన తర్వాత కూడా ఎన్నికలు నిర్వహించకుండా మీనమేషాలు లెక్కిస్తూ.. ప్రత్యేక అధికారుల పాలనతో పంచాయితీ బండి లాగిస్తున్న తీరును తప్పు పట్టింది. ఇందుకు సంబంధించిన జీవో 90ను కొట్టిపారేసింది. వెంటనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంది. పంచాయితీ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కోరుతూ మాజీ సర్పంచ్ లు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై స్పందించిన హైకోర్టు బాబు సర్కారుకు షాకిచ్చింది. ఆగస్టు 1 నుంచి పంచాయితీల పాలనను స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లో పెట్టిన బాబు సర్కారుకు.. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్నికలకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.

ఇంతకూ పంచాయితీ ఎన్నికల విషయంలో బాబు సర్కారు ఎందుకు ఆసక్తి ప్రదర్శించటం లేదన్న విషయంలోకి వెళితే.. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉండటం.. ఎన్నికలు జరిగితే అధికారపక్షానికి షాకిచ్చేలా  ఫలితాలు వస్తే.. దాని ప్రభావం సార్వత్రిక ఎన్నికల మీద పడే వీలుంది. అందుకే.. సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకూ స్పెషల్ ఆఫీసర్లతో బండి లాగించాలని బాబు సర్కారు భావించినట్లు చెబుతారు.

దీనికి బ్రేకులు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో ఇప్పుడు పంచాయితీ ఎన్నికల్ని నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. పంచాయితీ ఎన్నికల్నివెంటనే నిర్వహించాలని ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం పంచాయితీ ఎన్నికల్ని వెంటనే నిర్వహించాలంటూ ఇటీవల కాలంలో తరచూ గళం విప్పుతున్నారు. తాము పంచాయితీ ఎన్నికల బరిలోకి దిగుతామని పవన్ వ్యాఖ్యానించటం తెలిసిందే. విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం పంచాయితీ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు గతంలోనే పేర్కొన్నారు.  హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో 3 నెలల వ్యవధిలో పంచాయితీ ఎన్నికల్ని ఏపీలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఏపీలోనూ రాజకీయ వాతావరణం వేడెక్కుతుందని చెప్పక తప్పదు.