Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారు హైకోర్టును హర్ట్ చేసింది!

By:  Tupaki Desk   |   28 Sep 2016 6:39 AM GMT
కేసీఆర్ సర్కారు హైకోర్టును హర్ట్ చేసింది!
X
తాను అనుకున్నది ఏదోలా సాధించుకునే తత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎక్కువే. తాను పట్టుబట్టింది దక్కకపోతే ఆయన అస్సలు ఊరుకోరు. కొంతకాలం ఆగాలన్న అంశాల విషయంలోనూ ఆయన దృష్టి పెట్టి ఏదోలా సాధించుకునే యావ‌ ఆయనకు కాస్త ఎక్కువే. తాజాగా అలాంటి వైఖరినే ప్రదర్శించిన కేసీఆర్‌ హైకోర్టుకు ఆగ్రహం కలిగించేలా చేశారని చెప్పాలి. ఈ మొత్తం వ్యవహారాన్ని సాంకేతిక భాషలో చెప్పే కన్నా.. సింపుల్ గా అందరికి అర్థమయ్యేలా విషయాల్ని చెప్పాల్సి వస్తే.. ఆంధ్రప్రదేశ్ ఆడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ పరిధి నుంచి త‌న‌ను మినహాయించాలని తెలంగాణ సర్కారు కోరడంతో హైకోర్టు హ‌ర్ట్ అయ్యింది.

అలా చేస్తే.. తెలంగాణకు సంబంధించిన కేసులు హైకోర్టు చూడాల్సి ఉంటుంది. దీని వల్ల తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం సూటిగా చెప్పటం కష్టం కానీ.. మొత్తంగా చూసినప్పుడు విడిపోయిన తర్వాత కూడా ఏపీకి చెందిన సంస్థల్లో భాగస్వామి కావటం తెలంగాణ సర్కారుకు ఇష్టం ఉండని నేపథ్యంలో బయటకు రావాలనుకునే పరిస్థితి. ఇక్కడ ఇబ్బందంతా ఏమిటంటే.. ఏపీ ట్రైబ్యునల్ నుంచి బయటకు వచ్చేస్తే.. తెలంగాణకు చెందిన కేసులన్నీ హైకోర్టు మీద భారం పడుతుంది.

ఇప్పటికే కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో.. కొత్తగా వచ్చే కేసుల్ని తీసుకునే పరిస్థితుల్లో హైకోర్టు లేదు. అయితే.. మేం ఇలా చేయాలనుకుంటున్నాం.. మీ మాటేమిటి? అని సలహా అడగాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. అందుకు తగ్గట్లే కేసీఆర్ సర్కారు.. హైకోర్టును సలహా కోరింది. అయితే.. దానికి సమాధానం బయటకు రాలేదు. ఆ కొద్ది టైం కూడా వెయిట్ చేయని తెలంగాణ సర్కారు.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. త‌మ‌కు ఏపీ ట్రైబ్యునల్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. మొత్తంగా కేంద్రం కూడా ఓకే అంది.

ఒకవైపు హైకోర్టు తన అభిప్రాయాన్ని చెప్పక ముందే.. కేంద్రం వద్దకు వెళ్లి ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ కొందరు న్యాయవాదులు ఒక వ్యాజ్యాన్ని హైకోర్టులో వేశారు. తాజాగా దానిపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ - జస్టిస్ యు.దుర్గా ప్రసాదరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ట్రైబ్యునల్ లో మొత్తం 17,554 కేసులు పెండింగ్ ఉండగా.. తెలంగాణకు చెందిన కేసులు 8670 ఉన్నాయి. ట్రైబ్యునల్ నుంచి తప్పించాలని కోరే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉందన్నది కేసీఆర్ సర్కారు వాదన. ప్రభుత్వ విధాన నిర్ణయం ప్రకారం కేంద్రం నుంచి అనుమతి తీసుకోవటం తప్పేం కాదన్నది వారి వాదన.

దీనికి కౌంటర్‌ గా నడుస్తున్న వాదన ఏమిటంటే.. ఒకపక్క హైకోర్టు సలహా కోరి.. దానికి హైకోర్టు స్పందించే లోపే కేంద్రం నుంచి మినహాయింపు ఎలా తీసుకుంటారన్నది ప్రశ్న. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. తెలంగాణ సర్కారు తీరును తప్పు పట్టటం గమనార్హం. ప్రస్తుతం హైకోర్టులో 23 మంది జడ్జీలే ఉన్నారని.. 3.5 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయని.. ఇప్పటికే భారీ భారం హైకోర్టు మీద ఉన్న వేళ.. మరో 8,670 కేసుల భారం మోయటమా? అంటూ సూటిగా ప్రశ్నించింది. సున్నితమైన అంశాల్లో నిరీక్షించటం తప్పేం కాదు. కానీ.. దూకుడుతో వెళ్లటం ద్వారా మరిన్ని సమస్యలు కొని తెచ్చుకోవటమే తప్ప మరెలాంటి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అన్ని తెలిసిన కేసీఆర్ ఎందుకిలా చేస్తున్నారు? ఆయనకు ఫీడ్ బ్యాక్ ఇస్తున్న వారు.. సరైన సమాచారం అందించటం లేదన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/