Begin typing your search above and press return to search.

హైకోర్టు వ్యాఖ్య‌: తెలంగాణ ప్ర‌భుత్వం చిన్న కోతిలా మిగిలిపోవ‌ద్దు

By:  Tupaki Desk   |   24 April 2019 5:24 AM GMT
హైకోర్టు వ్యాఖ్య‌: తెలంగాణ ప్ర‌భుత్వం చిన్న కోతిలా మిగిలిపోవ‌ద్దు
X
ఒక ప‌థ‌కానికి సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రాల‌కు రావాల్సిన నిధులు రాక‌పోవ‌టం ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏం చేయాలి? కేంద్రం నుంచి నిధులు రాకుంటే.. ఆయా రాష్ట్రాలు చేతులు ముడుచుకోవ‌టం ప‌రిష్కారమా? అంటే కాదంటే కాద‌నేస్తారు. ఇదే విష‌యాన్ని కేసీఆర్ వ‌ద్ద ప్ర‌స్తావిస్తే.. ఆయ‌న నోటి నుంచి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌స్తావ‌న వ‌స్తుంది. అలాంటి ఆయ‌న‌.. కేంద్రం నుంచి త‌మ ప్ర‌భుత్వానికి రావాల్సిన నిధుల గురించి నీళ్లు న‌మ‌ల‌టం ఒక ఎత్తు అయితే.. హైకోర్టు చేసిన వ్యాఖ్య‌లు మ‌రో ఎత్తుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

విద్యాహ‌క్కు చ‌ట్టం అమ‌లులో భాగంగా కేంద్రం స‌గం వాటాను భ‌రించాల్సి ఉంది. మ‌రి.. అలాంట‌ప్పుడు ఆ నిధుల కోసం కేంద్రాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌కూడ‌దు? అవ‌స‌ర‌మైతే న్యాయ‌పోరాటం ఎందుకు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

ఉద్య‌మం చేసి ఒంటి చేత్తో తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రాన్ని తెచ్చిన‌ట్లుగా చెప్పే కేసీఆర్‌.. ఈ రోజున కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేద‌న్న‌మాట‌తో త‌ప్పించుకోవ‌టం సరికాదు. విచిత్ర‌మైన విష‌యం ఏమంటే.. కేసీఆర్ స‌ర్కారును ఉత్సాహ‌ప‌రిచేందుకు హైకోర్టు వ్యాఖ్య‌లు చేయాల్సి రావ‌టం గ‌మ‌నార్హం.

కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని ర‌ప్పించుకునే అంశంపైన హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. వాల్మీకి రామాయ‌ణంలో ఆంజ‌నేయుడిని లంక‌కెళ్లి సీత‌ను చూసి ర‌మ్మంటే.. ఇంత స‌ముద్రాన్ని ఎలా దాటాల‌ని అనుకున్నాడ‌ని.. జాంబ‌వంతుడు ఆంజ‌నేయుడి శ‌క్తి గురించి చెబితే ఒకే అడుగుతో భార‌త్ నుంచి శ్రీ‌లంక‌కు వెళ్లాడ‌న్నారు. ఇక్క‌డ తెలంగాణ ప్ర‌భుత్వం కూడా చిన్న కోతిలా మిగిలిపోకూడ‌ద‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ శ‌క్తి అపార‌మ‌ని అనుకుంటే ఏదైనా చేయ‌గ‌ల‌దంటూ వ్యాఖ్యానించింది.

విద్యాహ‌క్కు చ‌ట్టం అమ‌లులో భాగంగా కేంద్రం స‌గం వాటానుభ‌రించాల్సి ఉన్నా.. ఆ నిధులు రాక‌పోవ‌టంతో తెలంగాణ ప్ర‌భుత్వం గ‌మ్మున ఉంది. దీనిపై దాఖ‌లైన పిటిష‌న్ ను విచారిస్తున్న వేళ‌.. హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసిన‌ప్ప‌టికీ ఆ మార్పులు ఇంకా అమ‌లు కాక‌పోవ‌టంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

కేంద్రం నిధులు ఇవ్వ‌కుంటే ఆ విష‌యం మీద సుప్రీంకోర్టుకు వెళ్లాల‌ని హైకోర్టు పేర్కొంది. కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య విభేదాలు ఉంటే సుప్రీంకోర్టును ఆశ్ర‌యించొచ్చ‌ని రాజ్యాంగ‌మే చెబుతోంద‌ని పేర్కొన్నారు. ఉద్య‌మ సింహంగా పేరున్న కేసీఆర్ లాంటి నేత తెలంగాణ ప్ర‌భుత్వాధినేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న వేళ‌.. హైకోర్టు ఆయ‌న శ‌క్తిసామ‌ర్థ్యాల్ని గుర్తు చేయాల్సిన ప‌రిస్థితి దేనికి నిద‌ర్శ‌నం? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. హైకోర్టు తాజా వ్యాఖ్య‌ల‌తో అయినా కేసీఆర్ లో చ‌ల‌నం వ‌స్తుందేమో చూడాలి.