ఎన్టీఆర్ ట్రస్టుపై శివాజీ షాకింగ్ కామెంట్స్!

Sun Nov 19 2017 15:49:33 GMT+0530 (IST)

నంది అవార్డుల వివాదం పై వివిధ చానెళ్లలో ఇష్టాగోష్టులు - చర్చా కార్యక్రమాలు - ఓపెన్ డిబేట్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. చర్చల ద్వారా ఆ వివాదాన్ని సద్దుమణిగేలా చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొన్ని చర్చల్లో వక్తల మధ్య మాటల తూటాలు పేలుతుండడంతో రసాభాస అవుతోంది. మరి కొన్ని చర్చల్లో కొందరు వక్తలు మెయిన్ టాపిక్ నంది వివాదాన్ని వదిలేసి వేరే టాపిక్ లపై వ్యాఖ్యలు చేసి మరో వివాదానికి తెర తీసేలా కనిపిస్తున్నారు. తాజాగా నంది వివాదంపై జరిగిన ఓ చర్చలో హీరో శివాజీ తెలుగుదేశం పార్టీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. వారిద్దరి మధ్య వేరే అంశంపై మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. చివరకు యాంకర్ ఇద్దరికీ సర్దిచెప్పి వివాదానికి ముగింపు పలకాల్సిన పరిస్థితి వచ్చింది.గతంలో కన్నా ప్రస్తుతం తాను చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నానని శివాజీ అన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు తమ పరిధిలో సామాజిక సేవ చేస్తున్నారని దాదాపుగా ప్రతి హీరోకు సొంత ట్రస్ట్ ఉందని అన్నారు. కేవలం ‘ఇన్ కం టాక్స్’ ఎగ్గొట్టేందుకు కొందరు హీరోలు... ట్రస్ట్ లు ఏర్పాటు చేశారని బాబూ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆ మాటలకు మండిపడ్డ శివాజీ......నాడు ఎన్టీఆర్ కూడా ఇన్ కం ట్యాక్స్ ఎగ్గొట్టేందుకే ట్రస్ట్ ఏర్పాటు చేసారా? అని ప్రశ్నించారు. అయితే  ఎన్టీఆర్ పెట్టింది ట్రస్ట్ కాదని అది రాజకీయ పార్టీ అని బాబూ రాజేంద్రప్రసాద్...తన వ్యాఖ్యలను  సమర్ధించుకోబోయారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో చాలా పెద్ద ట్రస్ట్ ఉందని బాబూ రాజేంద్రప్రసాద్ కు గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యలు సరికావని శివాజీ మండిపడ్డారు. దీంతో వారిద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఆ సమయంలో యాంకర్ ....వారిద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసారు. బాబూ రాజేంద్రప్రసాద్  వ్యాఖ్యలతోనే తాను ఎన్టీఆర్ ట్రస్టు ప్రస్తావన తేవాల్సి వచ్చిందన్నారు.