Begin typing your search above and press return to search.

మనవళ్లతో 'మహా' వ్యూహం...!?

By:  Tupaki Desk   |   20 Sep 2018 4:25 AM GMT
మనవళ్లతో మహా వ్యూహం...!?
X
గెలవాలి. ఏం చేసైనా నిలవాలి. ఎన్ని వ్యూహాలు పన్నినా విజయం సాధించాలి. తెలంగాణ గద్దె నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిని తప్పించాలి. ఇదే మహాకూటమి నాయకుల మనోగతం. అభిమతం. ఆశయం. ఇందుకోసం... ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావును అధికారం నుంచి తప్పించేందుకు రోజుకో కొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారు కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు. వారితో ప్రతి రోజూ టచ్ లో ఉంటూ తమ వంతు వ్యూహరచనకు పదును పెడుతున్నారు తెలంగాణ జన సమితి నాయకులు. అందరిదీ ఒకే మాట... ఒకే బాట... ఒకే తూటాగా ఉండాలని ఈ నాయకులు కలుసుకున్న ప్రతిసారీ శపథం చేసుకుంటున్నారు. ఈ వ్యూహ రచనలో భాగంగా కొత్తవారిని ఎన్నికల బరిలో దించడం ఒకటైతే మహా నాయకుల వారసులను రంగంలో దించడం మరొకటిగా చెబుతున్నారు.

కాంగ్రెస్ - తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడేందుకు రంగం సిద్ధమైపోయింది. ఇక సీట్ల సద్దుబాటు ఒక్కటే మిగిలింది. ఇది కూడా సాధ్యమైనంత వరకూ ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని రాహుల్ గాంధీ - చంద్రబాబు నాయుడి వంటి నాయకులు తమ తెలంగాణ నాయకులకు దిశానిర్దేశం చేసారంటున్నారు. ఈ దశలో అభ్యర్ధుల ఎంపికపైనే ద్రష్టి పెట్టాలని మహాకూటమి నాయకులు భావిస్తున్నారు. ఇందుకోసం మహా నాయకులు ఎన్.టి.రామారావు మనవడు కల్యాణ్ రాం - మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మనవడు ఆదిత్యారెడ్డిలను ఈ ఎన్నికల బరిలో నిలపాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి - శేరిలింగం పల్లిలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎన్.టి.రామారావు మనవడు - తెలుగుదేశం నాయకుడు - ఇటీవలే ప్రమాదంలో మరణించిన హరికృష్ణ కుమారుడు కల్యాణ్ రాంను బరిలో దించాలన్నది తెలుగుదేశం నాయకుల ఆలోచనగా చెబుతున్నారు. ఇంతకు ముందు కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచింది. కులపరంగా చూసినా కల్యాణ్ రాం ఇక్కడి నుంచి గెలిచే అవకాశాలున్నాయి. పైగా ఇటీవలే హరికృష్ణ కారు ప్రమాదంలో మరణించడంతో ఆ సానుభూతి కూడా కలిసి కల్యాణ్ రాంకు క‌లిసొచ్చి విజయం సాధించే అవకాశాలున్నాయంటున్నారు. పోటీ చేసేందుకు ముందు కల్యాణ్ రాం విముఖత వ్యక్తం చేసినా చంద్రబాబు నాయుడు సద్దిచెప్పడంతో ఆయన అంగీకరించినట్లు చెబుతున్నారు.

ఇక మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మనవుడు మర్రి ఆదిత్యారెడ్డి ఇటీవలే తెలంగాణ జన సమితిలో చేరారు. ఆయనను తాండూరు నుంచి మహాకూటమి అభ్యర్ధిగా బరిలో దింపాలని భావిస్తున్నారు. యువకుడు - ఆదర్శ భావాలున్న ఆదిత్యా రెడ్డి తాండూరు నుంచి మహాకూటమి అభ్యర్ధిగా నిలబడితే విజయం తథ్యమని మహా నాయకులు భావిస్తున్నారంటున్నారు. వీరిద్దరితో పాటు మరికొందరు మహానాయకుల వారసులపై కూడా మహాకూటమి అగ్ర నాయకత్వం కన్నేసిందంటున్నారు. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో యువరక్తం ఉరకలు వేసే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.