Begin typing your search above and press return to search.

హెరిటేజ్ కంపెనీ నిర్వాహాకానికి డిస్ట్రిబ్యూటర్ బలి

By:  Tupaki Desk   |   11 Feb 2019 7:54 AM GMT
హెరిటేజ్ కంపెనీ నిర్వాహాకానికి డిస్ట్రిబ్యూటర్ బలి
X
హెరిటేజ్ కంపెనీ నిర్వాహాకానికి ఓ డిస్ట్రిబ్యూటర్ బలయ్యాడు. కంపెనీ తనకు అకారణంగా డిస్ట్రిబ్యూషన్ ఆపేయడం వల్ల అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాధితుడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పొలానికి చెందిన గంగినేని హరిబాబు(48) హెరిటేజ్ కంపెనీకి 2012నుంచి డిస్ట్రిబ్యూటర్ గా ఉంటున్నాడు. ఆ కంపెనీకి చెందిన పాలు, సంబంధిత పదార్థాల సీ అండ్ ఎఫ్(క్యారింగ్ అండ్ ఫార్వాడింగ్) డిస్ట్రిబ్యూటర్ గా చేరి రూ.2.8లక్షలు డిపాజిట్ చేశాడు. ఒంగోలు ఉంటున్న హరిబాబు కంపెనీల పాలను ఏజెంట్లకు సరఫరా చేస్తూ జీవిస్తున్నాడు. కాగా హరిబాబు అదనంగా డిపాజిట్ చెల్లించకపోవడంతో జనవరి 5న హరిబాబుకు సరుకులు నిలిపివేస్తున్నట్లు కంపెనీ నుంచి మొయిల్ అందింది.

దీంతో హరిబాబు కంపెనీ పెద్దలను బ్రతిమిలాడిని ఫలితం లేకుండా పోయింది. ఆఖరికి ఆ తెల్లవారే నారా భువనేశ్వరీ, బ్రాహ్మణిలకు హరిబాబు లేఖరాశాడు. డిస్ట్రిబ్యూషన్ ఆపేస్తే తాను ఆర్థికంగా నష్టపోవడంతోపాటు అప్పులపాలు కావాల్సివస్తుందని లేఖలో వేడుకున్నాడు. దీనిపై వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హరిబాబు మనస్థాపానికి గురయ్యాడు.

ఈ నేపథ్యంలోనే కంపెనీ డిపాజిట్ వెనక్కి ఇవ్వకపోవడంతో, రావాల్సిన బకాయిలు రాక ఇబ్బందులు పడ్డాడు. చివరకు తనకున్న 3.5ఎకరాల పొలం అమ్మి కొంత బాకీలు తీర్చినట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా ఆదివారం ఇంటి ముందు అపస్మారక స్థితిలో పడిపోగా బంధువులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే హరిబాబు మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. హరిబాబు మద్యంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. హరిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సమాచారం. ఇప్పటికైనా హెరిటేజ్ కంపెనీ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంలో హెరిటేజ్ కంపెనీ మానవత్వం చూపుతుందా? లేక వ్యాపార నియమాలనే పాటిస్తుందా అనేది చూడాలి మరీ..