Begin typing your search above and press return to search.

వీడు మనిషి కాదు.. మృగం

By:  Tupaki Desk   |   25 May 2016 5:47 AM GMT
వీడు మనిషి కాదు.. మృగం
X
తన కారును ఓవర్ టేక్ చేశాడన్న కోపంతో ఓ అమాయక టీనేజర్ ని బీహార్ ఎమ్మెల్సీ పుత్రరత్నం తుపాకీతో కాల్చి చంపిన వైనం దేశ వ్యాప్తంగా ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. ఆ విషయానికే అంతగా రియాక్ట్ అయితే.. తాజా ఉదంతం వింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. కేవలం డబ్బులున్నాయన్న అహంకారం.. ధన మదంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించటమే కాదు.. ఒక కుటుంబం మొత్తాన్ని చంపేయాలని చూసిన ఈ మానవ మృగాన్ని ఏం చేయాలి? రెండు రోజులుగా రోడ్డు ప్రమాదంగా భావించిన ఒక యాక్సిడెంట్ వెనుక అసలు నిజం బయటకు వచ్చి.. విన్న వారిని వణికించేలా చేస్తోంది. ఈ దారుణం దేశంలో ఏ మారుమూలనో కాదు.. మన ఇరుగుపొరుగుగా ఉంటే విశాఖ జిల్లా పరవాడలో చోటు చేసుకుంది.

రెండురోజుల క్రితం పరవాడ నేషనల్ హైవే మీద ఒక టూ వీలర్ ను కారు ఢీ కొట్టి వెళ్లటం.. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటన వెనుక ధనబలంతో బలిసి కొట్టుకునే రాక్షసత్వం ఉందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. మృతురాలి బంధువులు.. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. విశాఖ సమీపంలో అప్పలరాజు.. లావణ్య దంపతులు.. ఇద్దరు పిల్లలతో నివసిస్తుంటారు. ఆదివారం ఉదయం అప్పలరాజు.. అతని సతీమణి లావణ్య.. అతడి చెల్లెలు దివ్యలు కలిసి టూవీలర్ మీద అనకాపల్లి నూకాంబికా అమ్మవారి గుడికి వెళ్లారు. అమ్మవారి దర్శనానికి వెళ్లిన అప్పలరాజు కుటుంబ సభ్యులను అక్కడి స్థానికుడైన హేమంతకుమార్.. అతడి స్నేహితులు నలుగురు వేధించటం మొదలు పెట్టారు. అప్పలరాజు సతీమణి లావణ్యపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ దురుసుగా వ్యవహరించారు. వారితో గొడవ ఎందుకన్న ఉద్దేశంతో అప్పలరాజు కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణమయ్యారు.

మద్యం మత్తులో ఉన్న హేమంత్ కుమార్.. అతని స్నేహితులు అప్పలరాజు వాహనాన్ని వెంబడిస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేయసాగారు. ఈ క్రమంలోనే సాలాపువాని పాలెం వద్ద అప్పలరాజు టూవీలర్ ను కారుతో బలంగా ఢీ కొట్టారు. దీంతో లావణ్య కారు బాయ్ నెట్ మీద పడి రోడ్డు మీద పడిపోయింది. అయినా కనికరించని హేమకుమార్.. ఆమె పై నుంచి కారును తొక్కించేస్తూ వెళ్లిపోయాడు. దీంతో.. లావణ్య అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనలో అప్పలరాజు.. అతడి సోదరి దివ్యలు గాయాలపాలయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. తాజాగా వారు ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని పోలీసులకు వెల్లడించారు.

దీంతో.. హేమకుమర్ ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నించగా పరవాడలోని కొండ ప్రాంతంలో వారు ఉపయోగించిన కారు.. నెంబరు ప్లేట్ లేకుండా ఉండటాన్ని గుర్తించారు. అతడి అడ్రస్ తెలుసుకున్న పోలీసులు.. వారి ఇంటికి వెళ్లగా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి పరారీ అయినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. భారీగా ఆస్తి రావటంతో హేమ కుమార్ గర్వంతో విర్రవీగుతుంటాడని.. స్నేహితుల్ని వెంటేసుకొని తిరుగుతుంటాడని స్థానికులు పోలీసులు వెల్లడించారు. వ్యాపారులకు అప్పులు ఇవ్వటం చేస్తుంటాడన్న విషయాల్ని పోలీసులు గుర్తించారు. హేమకుమార్ తో పాటు అతని వెంట ఉన్న నలుగురు స్నేహితుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులున్నారు. డబ్బు బలుపులో ఏమైనా చేయొచ్చన్నట్లుగా వ్యవహరించిన హేమ కుమార్ ను ఏం చేయాలి? ఎలాంటి శిక్ష విధించాలి? అన్నవి ప్రశ్నలైతే.. ఇలాంటి మానవ మృగానికి సంబంధించిన వివరాలు తెలిస్తే వెనువెంటనే పోలీసులకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.