ఎంపీగా లాస్ట్ ఛాన్స్ అడుగుతున్న అందాల తార!

Tue Mar 26 2019 22:27:03 GMT+0530 (IST)

అలనాటి అందాల తార హేమమాలిని మరోసారి ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. మధుర నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న ఈ బీజేపీ నాయకురాలు ఈ సారి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు. అందు కోసం ఓటర్లకు అభ్యర్థనలు మొదలుపెట్టారు. విశేషం ఏమిటంటే.. ఇదొక్కసారి తనను గెలిపిస్తే చాలని హేమమాలిని ప్రజలకు చెప్పుకుంటున్నారు. తను  ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ఆఖరు సారి అని - ఈ సారి ఒక్కసారీ గెలిపించాలని.. ఇకపై పోటీ చేయడం ఉండదని హేమమాలిని చెబుతూ ఉండటం విశేషం.అయితే నియోజకవర్గంలో హేమమాలినికి అంత అనుకూలత కనిపించడం లేదు. గత ఎన్నికల్లో బీజేపీ గాలిలో హేమమాలిని సులభంగానే నెగ్గారు.  అయితే ఈమె నియోజకవర్గాలను పట్టించుకోదు.. అనే ప్రచారం ఒకటి ఉంది. అందుకు సంబంధించి కొన్నాళ్ల కిందట మధుర నియోజకవర్గంలో పోస్టర్లు కూడా వెలిశాయి.

హేమమాలిని కనపడుట లేదు అని మధుర నియోజకవర్గం వ్యాప్తంగా కొంతమంది పోస్టర్లు అతికించారు. తాము ఎంపీగా గెలిపిస్తే ఆమె మళ్లీ నియోజకవర్గం వైపు చూడటం లేదని.. నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆ పోస్టర్లలో వాపోయారు. మూడేళ్ల కిందటే మధుర నియోజకవర్గంలో అలాంటి పోస్టర్లు కనిపించాయి.

ఆ తర్వాత హేమమాలిని డ్యామేజ్ నియంత్రణ చర్యలు ఎంత వరకూ చేపట్టారో కానీ.. ఈ సారి పోటీ అంటున్నారు. ఇదే ఆఖరు సారి అని కూడా చెబుతున్నారు. మరి జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఈ అలనాటి డ్రీమ్ గర్ల్ విన్నపాన్ని!