Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో కురుస్తున్న వానతో ఎంత డేంజరంటే..

By:  Tupaki Desk   |   31 Aug 2016 6:21 AM GMT
హైదరాబాద్ లో కురుస్తున్న వానతో ఎంత డేంజరంటే..
X
హైదరాబాద్ లో కురుస్తున్న తీవ్రత ఎంత? అన్న ప్రశ్నకు ఎక్కువెక్కువ చెప్పకుండా సూటిగా సమాధానం చెప్పాలంటే.. జీహెచ్ ఎంసీ కమిషనర్ చేసిన విన్నపాన్ని వింటే పరిస్థితి మొత్తం అర్థమవుతుంది. భాగ్యనగర ప్రజలు ఊహించని రీతిలో ఆయన చేసిన వినతి సారాంశం ఏమిటంటే.. అత్యవసరమైతే తప్పించి ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని చెప్పారు. బుధవారం ఉదయం ఆరు గంటలకు చినుకులుగా.. సన్న జల్లులుగా మొదలైన వర్ష తీవ్రత నిమిషాలు గడుస్తున్న కొద్దీ జోరందుకుంది. ఇదెంత వరకూ వెళ్లిందంటే.. వర్షం కారణంగా రోడ్లు మొత్తం జలమయం కావటమే కాదు.. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయేలా మారాయి.

ఇక.. రోడ్ల మీదకు వచ్చిన వాహనాలు వర్షం కారణంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి. పల్లపు ప్రాంతాల్లో భారీగా నిలిచిన వర్షం తటాకాల్ని తలపిస్తున్నాయి. వాహనం ఏదైనా ముందుకు వెళితే ఏమవుతుందోనన్న భయంతో నెమ్మదిగానడుస్తున్న వాహనదారుల కారణంగా ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. హైదరాబాద్ రోడ్లన్ని అడుగడుగునా గుంటలతో ఉండటం.. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ఒకడుగు నుంచి రెండు అడుగుల నీరు నిలిచిపోయిన దుస్థితి. దీంతో.. రోడ్డు మీద ఎక్కడ ఏ గుంట ఉందో అర్థం కాక వాహనదారులు సతమతమయ్యే పరిస్థితి.

సాధారణంగా హైదరాబాద్ లో పడే వాన తీరు ఎలా ఉంటుందంటే.. కాలనీలో కురిసే వర్షం .. కాలనీ బయట ఉండని రీతిలో ఉంటుంది. అందుకు భిన్నంగా బుధవారం పరిస్థితినెలకొంది. హైదరాబాద్ మొత్తం వర్షం మబ్బు కమ్మేసి.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానతో నగర జీవి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రమాదకరమైన మ్యాన్ హోల్స్ ను తెరవొద్దంటూ సిబ్బందికి ఆదేశించారు జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. భారీ వర్షం కారణంగా ప్రహరీ గోడ కూలిన ఘటన రామాంతపూర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరోచోట ఇంటి పైకప్పు కూలింది. ఇక.. బోలక్ పూర్ లో పాతకాలపు ఇల్లు కూలి ముగ్గురు మరణించారు. ఇక.. రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులకు.. ప్రజలకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బయటకు వచ్చిన వారు ఆఫీసులకు వెళ్లటం తర్వాత.. తిరిగి ఇంటికి చేరటం ఎలా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

గంటలు గడుస్తున్నా.. ట్రాఫిక్ ముందుకు కదలని దుస్థితి. ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. హైదరాబాద్ కు ప్రత్యేకంగా ప్రకృతి విపత్తులేమీ అక్కర్లేదు. గట్టిగా నాలుగైదు గంటల పాటు వాన కురిస్తే చాలు.. భాగ్యనగరి మొత్తం వణికిపోయేలా కనిపిస్తోంది. జోరు వానకే భయపడే మహానగరం మనకు మాత్రమే సొంతమేమో..?