Begin typing your search above and press return to search.

భాగ్య‌న‌గ‌రిని నాన్ స్టాప్ గా ఉతికేస్తున్న వాన‌!

By:  Tupaki Desk   |   14 Sep 2017 5:41 AM GMT
భాగ్య‌న‌గ‌రిని నాన్ స్టాప్ గా ఉతికేస్తున్న వాన‌!
X
ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో సెప్టెంబ‌రులో ఎండ‌లు మండుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌ర్షాకాలంలో ఇంత తీవ్ర‌మైన ఎండ‌లు తెలుగు ప్ర‌జ‌ల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇదిలా ఉంటే.. నిన్న (బుధ‌వారం) అర్థ‌రాత్రి నుంచి హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాన్ని వ‌ర్షం ముంచెత్తుతోంది. బుధ‌వారం సాయంత్రం న‌గ‌రంలోని ప‌లుచోట్ల వ‌ర్షం ప‌డింది. బుధ‌వారం సాయంత్రం నాలుగు గంట‌ల నుంచి ద‌ట్ట‌మైన మేఘాలు అలుముకున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో భారీగా వ‌ర్షం కురిస్తే.. మ‌రికొన్ని ప్రాంతాల్లో ఒక మోస్త‌రు.. ఇంకొన్ని ప్రాంతాల్లో పెద్ద‌గా వ‌ర్షం కుర‌వ‌ని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. బుధ‌వారం అర్థ‌రాత్రి రెండు గంట‌ల త‌ర్వాత నుంచి వ‌ర్షం జోరు మొద‌లైంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ (గురువారం ఉద‌యం తొమ్మిది గంట‌లు) నాన్ స్టాప్ గా వ‌ర్షం ప‌డుతూనే ఉంది. అర్థ‌రాత్రి నుంచి ఈ తెల్ల‌వారుజామున ఆరు గంట‌ల ప్రాంతానికి న‌గ‌రంలోని కొన్ని ప్రాంతాల్లో ఏడు సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని చెబుతున్నారు.

నాన్ స్టాప్ వ‌ర్షాల కార‌ణంగా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం త‌డిసి ముద్ద‌యింది. భారీ వ‌ర్షాల కార‌ణంగా లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌శ‌యాల్ని త‌ల‌పిస్తున్నాయి. రోడ్లు మొత్తం వ‌ర్షం నీరు చేరుకుంది. చాలా జంక్ష‌న్లు వ‌ర్ష‌పు నీటితో నిండిపోవ‌టంతో ర‌వాణా ఇబ్బందిక‌రంగా మారింది. భారీగా వ‌ర్షం ప‌డుతున్న ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం చోటు చేసుకుంది.

న‌గ‌రంలోని బేగంపేట‌.. అమీర్ పేట‌.. పంజాగుట్ట‌.. ఎర్ర‌గ‌డ్డ‌.. ఖైర‌తాబాద్‌.. జూబ్లీహిల్స్‌.. బంజారాహిల్స్‌.. వ‌న‌స్థ‌లిపురం.. ఎల్ బీ న‌గ‌ర్‌.. సికింద్రాబాద్‌.. ఉప్ప‌ల్.. మియాపూర్‌.. కుక‌ట్‌ప‌ల్లి త‌దిర‌త ప్రాంతాల్లో భారీగా వ‌ర్షం న‌మోదైంద‌ని చెబుతున్నారు. వ‌ర్షం కార‌ణంగా లోత‌ట్టు ప్రాంతాల్లో వ‌ర‌ద‌నీరు ముంచెత్త‌టంతో ప్ర‌జ‌లు ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు.

లాలాపేట‌లోని ఫంక్ష‌న్ హాల్ లో చుట్టుప‌క్క‌ల వారికి పున‌రావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వ‌ర్షం నీరు భారీగా చేరుకున్ననేప‌థ్యంలో జ‌ల‌మ‌యం అయిన ప‌లు లోత‌ట్టు ప్రాంతాల్ని మంత్రి ప‌ద్మారావు ప‌ర్య‌టించి.. స‌హాయ‌క చ‌ర్య‌ల్ని ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మోకాళ్ల లోతు నీళ్ల‌ల్లోనూ మంత్రి ప‌ద్మారావు ప‌ర్య‌టిస్తున్నారు. లోత‌ట్టు ప్రాంతాల ప‌రిస్థితి ఇలా ఉంటే.. అపార్ట్ మెంట్ వాసుల ఇబ్బందులు మ‌రోలా ఉన్నాయి.

కొన్నిచోట్ల వ‌ర్ష‌పు నీరు అపార్ట్ మెంట్ సెల్లార్ల‌లోకి రావ‌టంతో అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు తీవ్ర ఇబ్బంందులు ఎదుర్కొంటున్నారు. మ‌రోవైపు వ‌ర్షం రేపు కూడా కురుస్తుంద‌న్న వాతావ‌ర‌ణ శాఖ సూచ‌న అధికారుల‌కు గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తేలా చేస్తోంది. న‌గ‌ర‌శివారులోని కొన్ని చెరువులు భారీ వ‌ర్షం కార‌ణంగా పొంగిపొర్లుతున్నాయి. ప‌లు కాల‌నీల్లోకి వ‌ర్ష‌పు నీరు భారీగా చేరుతోంది. నాన్ స్టాప్ గా కురుస్తున్న వ‌ర్షం నేప‌థ్యంలో కొన్ని ప్రైవేటు స్కూళ్లు ఇప్ప‌టికే సెల‌వు ప్ర‌క‌టించాయి. భారీగా కురుస్తున్న వ‌ర్షం కార‌ణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాంలు చోటు చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఏ కార్య‌క్ర‌మానికి వెళ్లాల‌న్న ఆలోచ‌న ఉన్నా.. రోజువారీ కంటే గంట నుంచి గంట‌న్న‌ర ముందుగా బ‌య‌లుదేర‌టం మంచిద‌న్న సూచ‌న‌ను ప‌లువురు చేస్తున్నారు.